WorldWonders

హిమాచల్‌లో 1000పక్షుల అనుమానస్పద మృతి

హిమాచల్‌లో 1000పక్షుల అనుమానస్పద మృతి

కారణమెంటో తెలీకుండా హిమాచల్ ప్రదేశ్‌లో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షుల మరణాలు సంభవించాయి. వాటిలో అంతరించే దశలో ఉన్న పక్షులు కూడా ఉన్నాయి. సుమారు వారం రోజుల క్రితం పాంగ్ చిత్తడి నేలలో వాటి కళేబరాలను జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరించే దశలో ఉన్న బాతు వలే కనిపించే బార్ హెడెడ్‌ గూస్ 1000కిపైగా మరణించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చనిపోవడానికి ముందు అవి వింతగా ప్రవర్తించాయని చెప్తున్నారు. ఈ గూస్‌తో పాటు షోవెలెర్, రివర్ టర్న్, బ్లాక్‌ హెడెడ్‌ గల్‌, కామన్ టీల్ వంటివి కూడా ఉన్నాయని తెలిపారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో మరణాలు సంభవించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. వాటి మిస్టరీ మృతి వెనక కారణాలు అన్వేషించడానికి కళేబరాలను పలు ల్యాబ్స్‌కు పంపామని తెలిపారు. ఆ ఫలితాలు రావడానికి రోజులు, వారాలు పట్టొచ్చన్నారు. ‘ఆ పక్షుల రెక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎగరలేకపోయాయి. అది చాలా ఆందోళన కలిగించింది. కొంచెం దూరం వెళ్లాక వాటి కళేబరాలు కనిపించాయి’ అని ఆమె విచారం వ్యక్తం చేశారు. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్త కేఎస్ గోపి సుందర్ మాట్లాడుతూ..వ్యాధి ఏమైనా కారణం కావొచ్చని అభిప్రాయడ్డారు. వాతావరణ మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పలేమన్నారు. అలాగే అత్యవసర పరిస్థితులకు తగ్గట్టుగా వన్యప్రాణుల విషయంలో వేగంగా స్పందించే వ్యవస్థ భారత్‌లో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవి విషాహారం వల్ల సంభవించిన మరణాలు కాదని ప్రాథమికంగా వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఫతేపూర్ ప్రాంతంలో బాతులు, కామన్ టీల్ హఠాత్తుగా మరణించడాన్ని డిసెంబర్ 28న క్షేత్ర సిబ్బంది గుర్తించారు. తరవాత రోజు ఆ ప్రాంతమంతా గాలించగా..నగ్రోటా రేంజ్‌లో 421 కళేబరాలను గుర్తించారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు వెయ్యికి చేరింది. దానిపై హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి మాట్లాడుతూ..ఆ పక్షుల మరణాలపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. ప్రతి ఏడాది శీతకాలం దాదాపు 114 రకాలకు చెందిన లక్షకుపైగా పక్షులకు ఈ చిత్తడి నేలలు ఆవాసంగా మారాయి. బాతులతో పాటు, కామన్‌ టీల్, కామన్ పోచర్డ్, గ్రేట్ కార్మోరెంట్ వంటి పలు రకాల పక్షులు ఇక్కడ సేదతీరుతుంటాయి.