Politics

రామతీర్థాన్ని ఆధునీకరిస్తాం-తాజావార్తలు

CID Enquiry On Ramateertham Incident - Telugu News Roundup

* విజయనగరం జిల్లా రామతీర్థం, రాజమహేంద్రవరం విఘ్నేశ్వరాలయం ఘటనలపై సీఎం జగన్‌ సీఐడీ విచారణకు ఆదేశించారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయాలని నిర్ణయించామని.. విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. ఇది సున్నితమైన ఘటన అని.. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుందని చెప్పారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు దొరికాయన్నారు. రెండు మూడు రోజుల్లో వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ నమూనాను మంత్రి మీడియాకు విడుదల చేశారు.

* కేంద్రం దిగిరావట్లేదు.. రైతులు పట్టువీడట్లేదు.. ఫలితంగా సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసా..గుతూనే ఉంది. కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య సోమవారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఏడో విడత చర్చల్లోనూ ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో ఈసారి కూడా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు పట్టుబడుతుండగా.. కేంద్రం ససేమిరా అనడంతో చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో జనవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

* దేశంలో కరోనా కొత్త రకం(యూకేలో వెలుగుచూసిన రకం) వైరస్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బెంగళూరులోని నిమ్హన్స్‌లో 10, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, పుణెలోని ఎన్‌ఐవీలో 5, దిల్లీలోని ఐసీఐబీలో 11, ఎన్‌సీడీసీలో 8, కోల్‌కతాలోని ఒక ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్టు తెలిపారు. వైరస్‌ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది. పాజిటివ్‌ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. ఓవైపు దేశంలో కరోనా కేసులు నానాటికీ తగ్గుతున్న వేళ.. స్ట్రెయిన్‌ కేసులు కలవరపెడుతున్నాయి.

* తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పంచన చేరినవాళ్లు తెలంగాణ ద్రోహులేనని చెప్పారు. ప్రముఖ కళాకారుడు దరువు ఎల్లన్న భాజపాలో చేరిన సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు అధికారంలో ఉండొద్దా?అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై సంజయ్‌ మండిపడ్డారు.

* రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదని పేర్కొన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని.. పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్‌ పేర్కొన్నారు. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పోలీస్ పరేడ్‌ మైదానం కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ సవాంగ్‌ ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ గాయకుడు దిల్జిత్‌దోసాంజ్‌ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రైతుల కోసం ఆయన రూ.కోటి విరాళంగా ప్రకటించడంతో పాటు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనపై బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌తో పాటు పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. కోటి రూపాయల విరాళం ఇచ్చి కూడా బయటికి చెప్పుకోకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై దిల్జిత్‌ స్పందించారు.

* పేకాట శిబిరాలపై తెదేపా నేతలు తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొడాలని నాని మండిపడ్డారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడి వ్యవహారం అనంతరం సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. భేటీ ముగిసిన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు. తనపై బురద చల్లేందుకు తెదేపా, జనసేన ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో తన నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు మూయించింది తానేనని చెప్పారు. ప్రభుత్వం, తాను ఆదేశిస్తేనే పేకాట శిబిరాలపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు జరిపారన్నారు.

* భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి తన జీవితాన్ని బిజీగా గడుపుతున్నారు. గతేడాది రాంచీలో 2వేల కడక్‌నాథ్‌ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ప్రారంభించగా.. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయల ఎగుమతులపై దృష్టి సారించారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన స్ట్రాబెర్రీ, క్యాబేజీ, టమాట సహా ఇతర కూరగాయల్ని దుబాయ్‌కి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

* ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం.. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సీఎం గవర్నర్‌కు వివరించారు. దేవాలయాలపై దాడులు, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

* జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి రుణాలు విడుదల చేసింది. పదో విడతగా రూ.6వేల కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం రుణంగా ఇచ్చింది.

* కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. దేశ రాజధానివ్యాప్తంగా తొలి దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం 500 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. టీకాలను 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేలా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

* వరంగల్‌ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి మేరకు స్థానిక నేతన్నలకు మరింత ప్రయోజనం కలిగేలా మినీ పార్క్‌ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చేనేత, జౌళి శాఖపై ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు తమ పని కొనసాగిస్తున్నారని, చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక టెక్స్‌టైల్‌ రంగానికి ఇస్తున్న మద్దతుతో వలస వెళ్లిన అనేకమంది రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.

* కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము మోసపోతున్నామని నమ్ముతున్న రైతుల కోపాన్ని ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తిరువళ్లువర్ బోధనలను ప్రస్తావించారు.

* వైకాపా నేతలు ఏపీని హత్యల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెదేపా మాజీ సర్పంచి అంకులును దారుణంగా హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హత్యలతో తెదేపా కార్యకర్తలను బెదిరించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి తెదేపా అన్ని విధాలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. నిందితులను 24గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అచ్చెన్న హెచ్చరించారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ సోదరులను గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

* గుంటూరు జిల్లా పెదగార్లపాడులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించారు. నిన్న రాత్రి దారుణ హత్యకు గురైన తెదేపా నేత, మాజీ సర్పంచ్‌ పురంశెట్టి అంకులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య పున్నమ్మ, ఇతర కుటుంబసభ్యులను లోకేశ్‌ ఓదార్చారు. అనంతరం అంకులు మృతదేహం వద్ద లోకేశ్‌తోపాటు తెదేపా ముఖ్యనేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యరపతినేని శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు.