Politics

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

2021 Central Budget On February 1st

కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేసిన కేంద్రం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) మంగళవారం సిఫారసు చేసింది. బడ్జెట్‌ సెషనల్‌లో తొలి దశ సమావేశాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు జరపాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2021 ను సమర్పించనున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు బడ్జెట్‌ మలి దశ సమావేశాలు జరుగుతాయి. అలాగే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తరువాత ఎన్‌డీఏ సర్కార్‌కు ఇది తొలిబ బడ్జెట్‌ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సన్నాహకాల్లో తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల పెద్దలతో భేటీ అయ్యారు. అలాగే బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘హల్వా వేడుక’, బడ్జెట్ పేపర్పత్రాలను ముద్రించే ప్రక్రియ ఉంటుంది. దీంతోపాటు ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో రూందించిన ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు విడుదల చేయడం లాంటి కీలక అంశాలు. కాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా రైతుల నిరసనలు, కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ లాంటి అంశాలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు చర‍్చకు రానున్నాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా, డైరెక్టుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నామని కేంద్రం ప్రకటించడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే.