ScienceAndTech

సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ రికార్డు

సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ రికార్డు

భాగ్యనగరం ఖాతాలో మరో ఘనత చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్‌’సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘‘ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం’’అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది.
***సురక్షిత నగరం బాటలో!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారు. వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు భాగ్యనగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో సురక్షిత నగరంగా పేరొందితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించారు. 2014లో అమల్లోకి వచ్చిన ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లండన్‌ను ఆదర్శంగా తీసుకుని భారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించాయి. ఈ క్రమంలో వీటి ఏర్పాటులో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పోలీస్‌ నిలిచిన విషయం తెలిసిందే. ఇక నగరాల వారీగా చూస్తే చెన్నై మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉండే సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సైతం నిక్షిప్తం చేయడం మరో ప్రత్యేకత.
** సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా… హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది.
***దేశంలో ప్రస్తుతం ఏ నగరంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంటే..
*ఢిల్లీ – 4,29,500
*హైదరాబాద్‌ – 3,25,000
*చెన్నై – 2,80,000
*కోల్‌కతా – 13,800
*ముంబై – 9,800
*అహ్మదాబాద్‌ – 6,281
*బెంగళూరు – 1,301
*కొచ్చి, జైపూర్‌ – 1000
**చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్‌ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్‌ ముందున్నాయని సర్వే తెలిపింది. చదరపు కిలోమీటరుకు 657 కెమెరాలతో చెన్నై మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 480 కెమెరాలతో హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. సర్వేలో టాప్‌–10లో చోటు సాధించిన నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌టెన్‌ నగరాలివే..

నగరం సీసీ కెమెరా (చదరపు 1,000 కిలోమీటరుకు) మందికి

1 చెన్నై 657 25.5
2 హైదరాబాద్‌ 480 30.0
3 హర్బిన్‌ (చైనా) 411 39.1
4 లండన్‌ (బ్రిటన్‌) 399 67.5
5 గ్జియామెన్‌ (చైనా) 385 40.3
6 చెంగ్డూ (చైనా) 350 33.9
7 తైయువాన్‌ (చైనా) 319 119.6
8 ఢిల్లీ 289 14.2
9 కున్మింగ్‌ (చైనా) 281 45.0
10 బీజింగ్‌ (చైనా) 278 56.2