NRI-NRT

వెన్నెలకంటికి తానా నివాళి

TANA Pays Tribute To Vennelakanti

“స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో పది సంవత్సరాలకు పైగా సేవలందించి, చినిమాలపై ఆసక్తితో చెన్నై చేరి, వేల పాటలు రాసి, అనువాద చిత్రాలకు పనిచేసి సౌమ్యుడిగా, స్నేహశీలిగా, సాహిత్యాభిలాషిగా మన్నలను పొందిన వెన్నెలకంటి మృతి తెలుగు-తమిళ ప్రజల దురదృష్టం.” అని తానా ఓ ప్రకటనలో పేర్కొంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో డిసెంబర్ 27న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని, ఈ పరిస్థితి మారాలని అన్నారని తానా గుర్తు చేసుకుంది. ఆయన మృతి పట్ల తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యవర్గ సభ్యులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డా.తోటకూర్ ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు.