Politics

అఖిలప్రియ కిడ్నాప్ ప్రణాళిక వెనుక కథ ఇది

అఖిలప్రియ కిడ్నాప్ ప్రణాళిక వెనుక కథ ఇది

‘హఫీజ్‌పేట సర్వే నంబరు 80లో మా నాన్న కొన్న భూములవి. మీ సొంతమని ఎలా అంటారు? సంతకం పెడతారా? లేదా?’ అంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యాపారులు ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌రావులకు ఫోన్లు చేసి బెదిరించినట్టు బోయిన్‌పల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. మొత్తం 48 ఎకరాలుంటే 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అఖిలప్రియ సన్నాహాలు చేస్తున్నారని వారు చెప్పారు. హఫీజ్‌పేటలోని 48 ఎకరాల భూములను చాలా ఏళ్లక్రితం భూమా నాగిరెడ్డి కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. ఐదేళ్లక్రితం ప్రవీణ్‌రావు అదే సర్వే నంబరులో 25 ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. దీనిపై వివాదం తలెత్తడంతో ప్రవీణ్‌రావు వర్గీయులు రాజీ కోసం ఏవీ సుబ్బారెడ్డిని సంప్రదించారు. ఈలోగా నాగిరెడ్డి మృతి చెందారు. గత ఏడాది సెప్టెంబరులో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించగా, ప్రవీణ్‌రావు మియాపూర్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏవీ సుబ్బారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగిరెడ్డి చనిపోయాక భూములను సొంతం చేసుకునేందుకు అఖిలప్రియ, ఆమె సోదరి మౌనిక ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్‌రావు, అతడి సోదరులు తమ మాట వినడం లేదని అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ వారి అపహరణకు పథకం వేశారని పోలీసులు తెలిపారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాలతో మాట్లాడారు. వారం రోజుల క్రితం 15 మందిని హైదరాబాద్‌కు రప్పించారు. హైదరాబాద్‌ శివార్లలోని భార్గవరామ్‌ స్నేహితుడికి చెందిన ఓ పాఠశాలలో వారిని ఉంచి ఆదాయపుపన్ను అధికారుల్లా నటించాలంటూ శిక్షణ ఇచ్చారు. ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌రావులుంటున్న ఇంటి వద్ద కిడ్నాపర్లు నాలుగు రోజుల నుంచి రెక్కీ నిర్వహించి మంగళవారం రాత్రి రంగంలోకి దిగారు. ‘కిడ్నాప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపేందుకు భూమా అఖిలప్రియ సుపారీ ఇచ్చారు. ఆమెతో కలిసి నేనెందుకు కిడ్నాప్‌కు ప్రణాళిక వేస్తాను? ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్‌లతోనూ సంబంధాలు లేవు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా’ అని అన్నారు. నిందితురాలు అఖిలప్రియకు 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆశాజ్యోతి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అఖిలప్రియ అస్వస్థతకు గురవడంతో బుధవారం రాత్రి కొద్దిసేపు బేగంపేట మహిళా పోలీసు ఠాణాలో ఉంచారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. పోలీసులు తమ సోదరిని ఉదయం అదుపులోకి తీసుకున్నారని, మధ్యాహ్నం భోజనం ఇస్తామన్నా అనుమతించలేదని ఆమె సోదరి మౌనిక తెలిపారు.