Health

ఏలూరు రోగానికి కూరగాయలే కారణం

ఏలూరు రోగానికి కూరగాయలే కారణం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఏలూరు ఘటనలో.. బాధితుల అస్వస్థతకు కూరగాయలు కలుషితం కావడమే కారణం కావొచ్చని ఉన్నతస్థాయి కమిటీ బలంగా అభిప్రాయపడింది. ఏలూరు మార్కెట్‌కు వచ్చిన కూరగాయలు.. అక్కడినుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లినందున బాధితులు వేర్వేరు చోట్ల కనిపించారని పేర్కొంది. మంచినీటిలో కొన్ని కలుషితాలున్నా.. అవి పరిమితుల్లోనే ఉన్నాయని, ఈ సమస్యకు అవి మూలం కాదని నిర్ధారణకు వచ్చింది. అయినా.. కొంతకాలం పాటు ఉభయగోదావరి జిల్లాల వ్యాప్తంగా నీటి నమూనాలను తరచు పరీక్ష చేయడం చాలా అవసరమని సిఫార్సు చేసింది. కార్లు, ఇతర వాహనాలు సర్వీసింగ్‌ చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా చూడాలని చెప్పింది. నిషేధించిన రసాయనాలు పొలాల్లోకి చేరకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో రాష్ట్రస్థాయి ప్రయోగశాలలు ఏర్పాటుచేసి, ఆహారం, నీటి నమూనాల్లో ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లు ఉంటున్నాయేమో చూడాలని పేర్కొంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిసెంబరు 4 నుంచి 12వ తేదీ మధ్య 622 మంది బాధితులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరారు. మూర్ఛతో కింద పడిపోవడం, నోటివెంట నురగ, స్పృహ కోల్పోవడం, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో జిల్లా, విజయవాడ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఈ అంతుచిక్కని వ్యాధి మూలాలు తెలుసుకొనేందుకు జాతీయ, రాష్ట్ర సంస్థలు బాధితుల నివాస ప్రాంతాల్లో కూరగాయలు, చేపలు, పాలు, పండ్లు, భూగర్భ జలాలు, తాగునీటి నమూనాలు సేకరించాయి. బాధితుల నుంచి రక్తం, మూత్రం, మలం, వాంతి, వెన్ను ద్రవం నమూనాలను పరీక్షించి, ఫలితాలు వెల్లడించాయి. వీటిని 21 మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ క్రోడీకరించి, బాధితుల అభిప్రాయాలు, వారి అనారోగ్యం, నివాస ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేసి, నివేదికను తయారుచేసింది. పూర్తయిన నివేదికకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు.