ScienceAndTech

ఇస్రో డైరక్టర్‌పై విషప్రయోగం

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ(ఇస్రో) సీనియర్‌ శాస్త్రవేత్త తపన్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల కిందట తనపై విష ప్రయోగం జరిగిందని, తనను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కోరారు. ఈ మేరకు ‘సుదీర్ఘకాలం నుంచి ఉన్న రహస్యం’ టైటిల్‌తో ఫేస్‌బుక్‌లో ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు పీటీఐ కథనం వెల్లడించింది.

2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందని తపన్‌ మిశ్రా అన్నారు. తాను తీసుకున్న దోశ, చట్నీలో ప్రమాదకర ఆర్సెనిక్‌ ట్రైఆక్సైడ్‌ను కలిపారని ఆరోపించారు. ఈ విషం కారణంగా తన ఆరోగ్యం చాలా దెబ్బతిందని.. కోలుకునేందుకు దాదాపు రెండేళ్లు పట్టిందన్నారు. విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై అసాధారణ దద్దుర్లు, న్యూరాలజీ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. రెండేళ్ల పాటు అహ్మదాబాద్‌, ముంబయి, దిల్లీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని తాను ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. అయితే, ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని అన్నారు. దాని వల్లే వైద్యులు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విషప్రయోగం జరిగిన రెండు మూడు వారాలకే తాను చనిపోయేవాడినని చెప్పారు.

గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని తపన్‌ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా రోజులు రహస్యంగా దాచి ఉంచాల్సి వచ్చిందని అన్నారు. విష ప్రయోగం గురించి బయటకు చెప్పకూడదంటూ వందల కొద్దీ బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చినట్లు సంచలన ఆరోపణలు చేశారు. కొందరైతే క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన తనతో బేరసారాలు కూడా జరిపారని అన్నారు. అయితే వాటిని తాను తిరస్కరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇస్రో కీలక బాధ్యతల నుంచి తనను తొలగించినట్లు వెల్లడించారు.

ఇప్పటికీ ఈ రహస్యాన్ని బహిర్గతం చేయకుండా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయని తపన్‌మిశ్రా ఆరోపించారు. మానసిక స్థితి సరిగా లేని తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, గతేడాది సెప్టెంబరులోనూ తనపై మరోసారి విష ప్రయోగానికి విఫలయత్నం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు.

ఇస్రోకు చెందిన స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్‌ మిశ్రా.. ప్రస్తుతం ఇస్రోలో సీనియర్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే మిశ్రా వ్యాఖ్యలపై ఇస్రో ఇంకా స్పందించలేదు.