Kids

చెమ్మచెక్కలు ఆడించండి

చెమ్మచెక్కలు ఆడించండి

మనవళ్లు, మనవరాళ్ల ముద్దుముద్దు మాటల్ని చూసి తెగ మురిసిపోతుంటారు అమ్మమ్మలు, తాతయ్యలు. వాళ్లతో ఆడిపాడుతూ మరోసారి బాల్యంలోకి తొంగిచూస్తారు. అడిగిందల్లా కొనిస్తూ, వెరైటీ వంటకాలు తినిపిస్తూ గారాబంగా చూసుకుంటారు. అందుకే సెలవులొస్తే అమ్మమ్మలు, నాన్నమ్మలు దగ్గరికే పరిగెడతారు పిల్లలు. కానీ, ఈమధ్య పిల్లలు స్మార్ట్ఫోన్లో పడి గ్రాండ్పేరెంట్స్కి టైం ఇవ్వట్లేదు. అలాంటి పిల్లలకి దగ్గరవ్వాలంటే ఈ ఆటలు బెస్ట్ ఆప్షన్. పిల్లలకి ఆటలే ప్రపంచం..అందుకే వాళ్లకి దగ్గరవడానికి అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ల ప్రపంచంలోకి దూరాల్సిందే. ఇలా వాళ్లని గేమ్స్తో ఎంగేజ్ చేస్తే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడటంతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెద్దలకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది.
***ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే పిల్లలు ఆసక్తి చూపిస్తారు. అందుకే పిల్లలతో ఆటలంటే గ్రాండ్ పేరెంట్స్ రొటీన్కి భిన్నంగా ప్లాన్ చేయాలి. అలాగని బుర్ర బద్ధలు కొట్టుకోవాల్సిన పనేం లేదు. ఒకప్పటి మన ట్రెడిషనల్ గేమ్స్నే పిల్లలతో ఆడిస్తే చాలు. వామనగుంటలు, చెమ్మ చెక్క, అచ్చెనగిల్లలు, చైన్చైన్, నేలాబండ లాంటి ఆటల్ని పిల్లలకి పరిచయం చేస్తే వాళ్ల చైల్డ్హుడ్ని మెమరబుల్గా మార్చినట్టే.
*వామన గుంటలు
ఇది ఇద్దరు ఆడే ఆట. పిల్లలకి ఈ ఆట నేర్పడం వల్ల ఐ.క్యూ. లెవల్స్ పెరుగుతాయి. పెద్దలకీ పాత జ్ఞాపకాలన్నీ కళ్లముందుకొస్తాయి. ఈ ఆట కోసం చాక్పీస్తో నేలపై దీర్ఘ చతురస్రాకారంలో ఒక డబ్బా గీయాలి. ఆ డబ్బాకి అడ్డంగా రెండు వరుసలు చేయాలి. దానికి ఒకవైపు ఏడు , మరో వైపు ఏడు గుంటలు గీయాలి. ఇప్పుడు ఒక్కొక్కరూ 49 చింతపిక్కెలు లేదా శెనగలు, సీతాఫలం గింజలు తీసుకోవాలి. ఇద్దరూ ఆ బాక్స్కి చెరోవైపు కూర్చొని వాళ్ల దగ్గరున్న గింజల్ని ఏడుఏడు చొప్పున ఒక్కో బాక్స్లో నింపాలి. ఆ తర్వాత ఆట మొదలుపెట్టే వ్యక్తి తనవైపు డబ్బాల్లో తనకి నచ్చిన గుంటలో గింజలు తీసి మిగిలిన ఒక్కోటి వేస్తూ ఉండాలి. ఆ గింజలన్నీ అయిపోయాక తర్వాత గుంటలో గింజలు తీసి మిగతా వాటిల్లో వేయాలి. అలా రెండోసారి వేస్తున్నప్పుడు ఖాళీ గుంట తగిలితే దాని తర్వాత గుంటలోని గింజలన్నీ తీసుకోవచ్చు. ఇలా ఆడుతూ పోతే చివరిగా ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వాళ్లే విన్నర్. వామన గుంటల బోర్డ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది.
*చెమ్మ చెక్క
ఈ ఆట ఆడుతున్నంతసేపు ఉత్సాహం రెట్టింపవుతుంది పిల్లల్లో. ఇల్లంతా సందడిగా మారుతుంది కూడా. ఇద్దరితో మొదలుపెట్టి ఐదారుగురు వరకు ఈ ఆట ఆడొచ్చు. ‘‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ. అట్లు పోయంగ. ఆరగించంగ’’ లాంటి పాటలతో మొదలయ్యే ఈ ఆట పిల్లల ఫిజికల్ యాక్టివిటీని పెంచుతుంది. అలాగే డిఫరెంట్ రైమ్స్తో ఆడే ఈ ఆట వల్ల పిల్లల్లో మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.
*అచ్చెనగిల్లలు
ఐదు నున్నటి రాళ్లతో ఆడే ఆట ఇది. దీన్ని జంటలుగా లేదా సింగిల్గా ఆడొచ్చు. ఒక రాయిని పైకి విసిరి కింద రాళ్లని పట్టుకోవాలి. అలా పట్టుకునేటప్పుడు పైకి విసిరిన రాయిని కూడా కింద పడకుండా పట్టుకోవాలి. మొదట ఒకటి , రెండు, మూడు, నాలుగు పట్టుకోవాలి. చివరి దశలో అరచేతిలో రాళ్లు పట్టుకుని పైకి విసరాలి. వెంటనే అరచేతిని బోర్లా తిప్పి, చేతి వేళ్లపై వాటిని ఆపాలి. తిరిగి అరచేత్తో పట్టుకోవాలి. ఎవరెన్ని గిల్లలు ఎక్కువగా పట్టుకుంటే వాళ్లే విన్నర్. ఈ ఆటవల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డిజిట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు.
*నేలాబండ
ఈ ఆటలో ఎంత ఎక్కువమంది పాల్గొంటే అంత మజా. పంటచెక్కలు వేసి గా ఈ ఆటలో దొంగ ఎవరో డిసైడ్ చేస్తారు. ఆ దొంగని నేల కావాలా? బండ కావాలా? అని అడుగుతారు. దొంగ నేలంటే మిగిలినవాళ్లంతా బండ మీద నిల్చోవాలి. మధ్యమధ్యలో బండపై ఉన్నవాళ్లు దొంగకి ఛాలెంజ్ విసురుతూ నేలపైకి వస్తారు. వాళ్లు తిరిగి బండపైకి వెళ్లేలోగా దొంగ పట్టుకుంటే… చిక్కిన వాళ్లు దొంగవుతారు.
*చైన్చైన్
పిల్లల ఫిజికల్ యాక్టివిటీ పెంచాలంటే గ్రాండ్ పేరెంట్స్ ఈ ఆట కచ్చితంగా ఆడించాల్సిందే. ఈ ఆటని ఎంతమందైనా ఆడొచ్చు. ఈ ఆటలో ఒకరిచేతులు మరొకరు పట్టుకుని వరుసగా నిల్చుంటారు అందరూ. వాళ్లలో ఒకరు ఆ చేతుల లింక్ని విడదీసి బయటకి రావాలి. అలా తమ బలాన్ని అంతా ఉపయోగించి ఆ చేతి లింక్ని తప్పించిన వాళ్లు కింగ్ అవుతారు.