Movies

సోనూసూద్‌పై పోలీసు కేసు

సోనూసూద్‌పై పోలీసు కేసు

తన సొంత భవన నిర్మాణంలో నియమాలను ఉల్లఘించినట్లు నటుడు సోనూసూద్‌పై బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై వెంటనే కేసు నమోదు చేయాల్సిందిగా జుహూ పోలీసులను కోరారు. వివరాల్లోకి వెళితే సోనూసూద్‌ ముంబయి శక్తినగర్‌లోని తన ఆరంతస్తుల భవనాన్ని బీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా సమీపంలోని కొంత భూమిని కూడా అక్రమించారని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లఘించినందుకు ఆయనకు ఇప్పటికే నోటీసులు పంపామన్నారు. అయినప్పటికి సోనూ స్పందించలేదని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై సోనూసూద్‌ స్పందిస్తూ ‘నేను బీఎంసీ నుంచి అనుమతి తీసుకున్నాను, కానీ ప్రస్తుతం అది మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉంది’ అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం సోనూసూద్‌ కీలక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.