NRI-NRT

చాలా ఈజీ…నన్ను నేను క్షమించేసుకుంటా….

చాలా ఈజీ…నన్ను నేను క్షమించేసుకుంటా….

అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్‌ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షునికి ఉండే విశేష అధికారాలను స్వీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన తప్పిదాలపై నూతన ప్రభుత్వం దర్యాప్తు చేయకుండా ఎత్తువేస్తున్నారు. ‘‘స్వీయ క్షమాభిక్ష’’ ద్వారా తప్పులను ప్రక్షాళన చేసుకొని విముక్తి కావాలని ట్రంప్‌ భావిస్తున్నట్టు అమెరికా మీడియా పేర్కొంది. పదవి నుంచి దిగిపోయేముందు అమెరికా అధ్యక్షులు తప్పుచేసిన తమ స్నేహితులు, పార్టీ నాయకులను కాపాడుకోవడానికి క్షమాభిక్ష పెడుతుంటారు. ప్రస్తుత పరిపాలనతో ఏదోఒక రూపంలో ప్రమేయం ఉన్న తన కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్‌ కుష్నర్‌, కుమారులు ఎరిక్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిలకు క్షమాభిక్ష ఇవ్వాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుని హోదాలో తాను చేసిన తప్పిదాలపైనా విచారణ జరపకుండా తనకుతానుగా క్షమించుకోవాలని కూడా భావిస్తున్నారు. అధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే ‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. 2018 జూన్‌లోనే దీనిపై ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘‘నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి.’’ అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు. ట్రంప్‌ను క్షమించడానికి ఓ మార్గం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. గతంలో న్యాయశాఖ పంపించిన ఓ మెమోను ఆధారంగా చూపుతున్నారు. దాని ప్రకారం ‘‘ట్రంప్‌ అధ్యక్షునిగా దిగిపోయి ఉపాధ్యక్షునికి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు అధ్యక్షుని హోదాలో ట్రంప్‌నకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు’’ అని అంటున్నారు. అయితే ఈ మెమోకు చట్టబద్ధత లేకపోవడంతో దీన్ని అమలు చేయడం కష్టమే.