Devotional

పుల్లంపేట పొంగళ్ల ప్రసాదం పురుషులే పెడతారు

పుల్లంపేట పొంగళ్ల ప్రసాదం పురుషులే పెడతారు

సంక్రాంతి పండుగ సందర్భంగా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో ప్రత్యేక ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఆదివారం ఆ గ్రామంలో మగవారు మాత్రమే ఆలయంలో పొంగళ్లు పెడతారు. దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోనైనా ఆడవారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. అటువంటిది ఈ ఆలయంలో మగవారు పొంగళ్లు పెట్టడం వింతగొలిపే ఆచారం. మగవారు చేసిన ప్రసాదాన్ని వారే తినేస్తారు. ఆడవాళ్లకు పెట్టరు. ఆలయ ప్రాంగణంలోకి మహిళలు రావడం పూర్తిగా నిషేధం. అయితే ఆలయ ప్రాంగణానికి వెలుపల నుంచే సంజీవరాయునికి మొక్కుకొని మహిళలు తిరుగు పయనమవుతుంటారు.
**ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు ఆదివారం రోజున తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని బట్టి సంజీవరాయ ఆలయ ప్రాంగణంలో మగవారు పొంగళ్లు పెట్టుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా అక్కడికి చేరుకుని తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా పొంగళ్లు పెట్టుకున్నారు. సంజీవరాయునికి ఆలయం అంటూ లేదు. ఒక రాతి శిలపై ఉన్న లిపినే ఇక్కడ సంజీవరాయునిగా కొలుస్తున్నారు. ఉదయాన్నే గ్రామంలోని మగోళ్లంతా బుట్టల్లో పొంగళ్ల సామాగ్రిని తీసుకొచ్చి సంజీవరాయుని వద్ద పొంగళ్లు పెట్టారు. గ్రామంలో అనేక దుష్ఫలితాలు, దుష్పపీడల వల్ల ఇబ్బంది పడుతూ పంటలు బాగా పండకపోవడంతో ఓ బ్రాహ్మణుడు లిపితో ఇచ్చిన రాయిని ప్రతిష్ఠించి ఇక్కడ సంజీవరాయునిగా కొలిచి పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి గ్రామం సుభిక్షంగా ఉన్నట్లు గ్రామస్తులు అంటున్నారు. సంక్రాంతి పండుగ కంటే సంజీవరాయుని పొంగళ్లు పండగే ఈ గ్రామస్తులకు పెద్ద పండగ. మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పురుషులు స్వామి వారిని దర్శించుకుని కొబ్బరి, బెల్లాన్ని కానుకలుగా సమర్పించారు.