Politics

మరొకరిని సస్పెండ్ చేసిన నిమ్మగడ్డ-తాజావార్తలు

మరొకరిని సస్పెండ్ చేసిన నిమ్మగడ్డ-తాజావార్తలు

* ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఎస్‌ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను కూడా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగించారు. ఈ మేరకు కమిషన్‌ కార్యాలయంలో వాణీమోహన్‌ సేవలు అవసరం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్‌ చేశారు.

* ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలు కోసం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 8న షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ నిర్ణయం ఆర్టికల్స్‌ 14, 21ని ఉల్లంఘించినట్లు ఉందని తెలిపింది.

* తమ పరిశ్రమ నుంచి వ్యాక్సిన్ల రవాణా చరిత్రాత్మక ఘట్టమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ అందించడమే తమ ముందున్న ప్రధాన ఛాలెంజ్‌ అని చెప్పారు. 2021లో తమకు ఇదో పెద్ద సవాలేనని, ఏం జరుగుతుందో చూడాలన్నారు. దేశ వ్యాప్తంగా తొలి దశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా ఈ రోజు పుణె నుంచి పలు ప్రాంతాలకు కొవిషీల్డ్‌ టీకాలు పంపిణీ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

* మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్‌ డి.సి ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆత్యయిన స్థితి విధించాలన్న నగర మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ సిఫార్సు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో పెరుగుతున్న కేసుల కారణంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ డ్రాగన్‌ దేశం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశరాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉన్న గ్వాన్‌ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఐదు నెలల తర్వాత సోమవారం నాడు అత్యధికంగా 103 కేసులు నమోదు కాగా.. మంగళవారం చైనావ్యాప్తంగా 55కి పైగా కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో 40 కేసులు ఒక్క హెబీ ప్రావిన్స్‌లోనే నమోదైనట్లు ప్రావిన్షియల్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరోసారి పరిస్థితి చేజారి పోకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ భారీ స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. బీజింగ్‌లోనూ ఒక కరోనా కేసు నిర్ధారణ కావడంతో సంబంధిత ప్రాంతాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. అంతేకాకుండా ప్రజలను అనవసర ప్రయాణాలు మానుకోమని సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.

* ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పుణె నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులు తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కేంద్రంలో 40 క్యూబిక్‌ మీటర్ల వాకిన్‌ కూలర్‌ ఏర్పాటు చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారంతా అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని ఆదేశించారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు వ్యతిరేకిగా మారారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, రైతుకూలీలకు సీఎం నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. తెదేపా ప్రాంతీయ, పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయకర్తలతో చంద్రబాబు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల ఏడాదిన్నర కాలంలో 1,779 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వైకాపా పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55 శాతం పెరిగాయన్నారు. 400 రోజులుగా అమరావతి రైతులు, రైతుకూలీలు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని.. 30వేల రైతు కుటుంబాలను రోడ్డుకీడ్చారని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలను రద్దు చేసి సంక్షేమాన్ని కాలరాశారని విమర్శించారు. పన్నుల రూపంలో ప్రజలపై రూ.70వేల కోట్ల మేర భారం మోపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ..ఈ ఏడాదే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(వ్హో) హెచ్చరించింది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు సుమారు నెల రోజులక్రితమే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్‌ కూడా జనవరి 16 నుంచి భారీ టీకా కార్యక్రమానికి సిద్ధం అవుతోంది. ఇంకోవైపు, పలు దేశాల్లో ముఖ్యంగా ఐరోపాలో వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారికంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని రహమత్‌ నగర్‌లో ఈ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకపోయినా ఉచితంగా నీరు అందించనున్నారు. మిగతా ఏరియాల్లో , అపార్ట్‌ మెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. 20వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత ఛార్జీలతో జలమండలి బిల్లు వసూలు చేయనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటవలే విడుదల చేసింది. జ‌న‌వ‌రిలో జారీ చేసే డిసెంబ‌ర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథ‌కం అమ‌ల్లోకి వస్తుంది.‌ జల మండలికి గ్రేటర్ లో ఉన్నమొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2. 37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఈ పథకంతో 19.92 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

* జనగామ జిల్లాలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. పట్టణంలో అధికార తెరాస ఫ్లెక్సీలు ఉంచి భాజపాకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడంపై వివాదం నెలకొంది. ఈనేపథ్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భాజపా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న నేతలపై సీఐ మల్లేష్ యాదవ్‌ లాఠీ ఛార్జి చేశారు. అక్కడి నుంచి ఆందోళన కారులను ప్రత్యేక వాహనంలో తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

* వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకిలించాల్సిన అవసరం ఎంతేనా ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. జాతీయ యువ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే, ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలుస్తోన్న వారి భవిష్యత్తు మాత్రం క్రమంగా తగ్గుతోందని అన్నారు.‘ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువైన కుటుంబ రాజకీయాల వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి వారికి దేశమే ప్రథమ ప్రాధాన్యం కాదు, కేవలం వారి కుటుంబాలను రక్షించుకోవాడానికే ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఈ వ్యాధి కూడా ఒకటి.. వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని పేర్కొన్నారు.