DailyDose

ప్రియుడిని చంపిన కొవ్వూరు యువతి-నేరవార్తలు

ప్రియుడిని చంపిన కొవ్వూరు యువతి-నేరవార్తలు

* పెళ్లికి నిరాకరించాడన్న ఆక్రోశం.. వేరొకరిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ప్రియుడిని ఓ యువతి హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ ఎం.సురేష్‌ కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు చూసి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు విద్యుత్‌ లైన్‌పైకి దూసుకెళ్లడంతో.. పుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న ఐదుమంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూర్‌ జిల్లా తిరువయ్యూర్‌లో కల్లనై నుంచి మన్నార్‌గుడికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అకస్మాత్తుగా రహదారి నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్‌ లైన్‌ను ఢీకొట్టింది. దీంతో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న వారిలో ఐదుమంది విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ముగ్గురిని వరకూర్‌ ప్రాంతానికి చెందిన కల్యాణరామన్‌(55), గణేశన్‌(50), నాదరాజన్‌(45)లుగా గుర్తించారు. బస్సులో ఉన్న వారిలో పది మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* రుణయాప్‌ ద్వారా రుణం తీసుకుని, సకాలంలో చెల్లించకపోవటంతో వారి వేధింపులకు భయపడి గాజువాకకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. సి.సి.ఎస్‌. ఏసీపీ శ్రావణ్‌కుమార్‌, సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ సి.ఐ. చౌదరిలతో కలిసి డీసీపీ (క్రైమ్‌) సురేష్‌బాబు పలు వివరాలను వెల్లడించారు.

* తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేసిన వడ్డీ వ్యాపారిని హోటల్‌లో పనిచేస్తున్న వారితో కలిసి యజమాని నడి రోడ్డుపై రాళ్లతో పాశవికంగా దాడి చేసి చంపేశారు. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్‌ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ 248 వద్ద రహదారిపై ఈ నెల 10న అర్ధరాత్రి చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లో అరెస్టు చేశారు.

* మొన్న హాథ్రాస్‌ హత్యాకాండ, నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్‌లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు. మధ్యప్రదేశ్‌లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులు, సోదరితో కలిసి హార్ది గ్రామానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉంటోంది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ మహిళ జీవనోపాధి కోసం తన సోదరితో కలిసి ఓ షాపు నడుపుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఆమె షాపునకు వచ్చి తాగడానికి నీళ్లు కావాలి అని అడిగారు.. దీనికి బదులుగా బాధితురాలు నీళ్లు లేవు అని సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహించిన నిందితులు మహిళ ఇంటిని ధ్వంసం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కిరాతకంగా ఆమె శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించి వెళ్లిపోయారు. సంఘటన సమయంలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు. అనంతరం బాధితురాలని ఆమె చెల్లి ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహిళ శరీర భాగాల్లోంచి రక్తం వస్తుండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న రేవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అమిలియా పోలీసు స్టేషన్‌ ఇన్‌ఛార్జీ దీపక్‌ బెహగల్‌ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ అమానుష ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా స్పందిస్తూ.. నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.