Agriculture

గడ్డితో చీర నేసిన ప్రకాశం రైతు

గడ్డితో చీర నేసిన ప్రకాశం రైతు - Grass Saree Made By Prakasam District Farmer

గడ్డిపోచలతో చీర, కండువా తదితరాలను తయారుచేసి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలేనికి చెందిన కృష్ణమూర్తి శభాష్‌ అనిపించుకుంటున్నారు. వరిగడ్డిని నేర్పుగా పేనుతూ ప్రత్యేకతను చాటుతున్నారు. 70ఏళ్ల వయసులోనూ కళాతృష్ణను చాటుతున్నారు. బాల్యంలో పొలంబడిలో చేరాక పశువుల కోసం గడ్డితో తాళ్లు పేనడంతో మొదలై క్రమంగా చర్నాకోల, నాగలి రూపాల తయారీపై పట్టు సాధించారు. ఈ కళను మరింత సానబట్టి ఆరు గజాల చీరను రూపొందించారు. కుట్టు లేకుండా రవికను కూడా తయారుచేశారు. హ్యాండ్‌బ్యాగులు సహా అనేక రకాల వస్తువులను రూపొందించారు. గడ్డితో తయారుచేసిన 125 గ్రాముల బరువున్న శాలువాను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కప్పారు. ఆయన తనకు అవార్డును అందించారని కృష్ణమూర్తి గర్వంగా చెబుతున్నారు. హస్తకళలు, ఇతర ప్రదర్శనల సమయంలో ఆయన వాటిని చూపుతారు.
*తొలుత గడ్డిని నీటిలో నానబెడతారు. మెత్తబడిన గడ్డిని సన్నని దారంగా పేనుతారు. ఆ దారం స్వయంగా తయారు చేసుకున్న మగ్గంలాంటి ఫ్రేమ్‌లో అల్లుతారు. చీర అంచులకు మాత్రం మామూలు దారమే వాడతారు. ఈ వస్త్రం ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు. ఉతికితే మాత్రం నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. పేనిన చీరకు శ్రమ తప్ప రూపాయి ఖర్చు లేదు. మన దేశ నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడమే తన ఉద్దేశమని ఆయన అంటారు.