Devotional

అయ్యప్పకు నెయ్యి అభిషేకం ఎందుకు ఇష్టం?

Why is lord ayyappa fond of ghee

అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామినామ స్మరణతోనే జీవిస్తారు. శరణఘోషలు, భజనలతో స్వామిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు. అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. అందుకే దీక్షచేసిన భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఈ ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ. టెంకాయలోని నీటిని తీసి, ఆవు నేతిని నింపుతారు. నెయ్ తేంగా అంటే టెంకాయ అని అర్థం. దీక్షచేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు. టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీమహావిష్ణువు అనంతుని పాన్పుగా చేసుకుని క్షీరసాగరంలో పవళించివుంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారుచేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప పరమాత్మ. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిభిషేకం చేయడమంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులోనూ ఎంతో పరమార్థం దాగివుంది. నెయ్యి విష్ణువుకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేకప్రియుడు. ఇలా నెయ్యాభిషేకంతో హరిహరసుతునికి పూజలు నిర్వహించడం విశేషం. నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్లిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని ఇతర మనుషులు, జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీనమైన భగవత్ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలం, మకరవిలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజూ నిర్వహిస్తారు. తెల్లవారుఝామున 4.15 గంటలకు ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 11.30 గంటల వరకు నిరాటకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరగిరులు మరింత ఆధ్మాత్మికతను సంతరించుకుంటారు.

ప్రతి హిందువు జీవితంలో నమస్కారం ఓ అంతర్భాగం. నిద్ర మేల్కోగానే భూమాతకు, తల్లిదండ్రులు, సూర్య భగవానుడు, గురువులు, కుల, ఇష్ట దైవాలకు నమస్కారం చేసి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. అలాగే పెద్దలు కనపడితే నమస్కరించి, చిరునవ్వుతోనే పలకరిస్తాం. ఇది మన హిందూధర్మానికి మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. మన పెద్దలు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారో? ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చేయించినా అందులో నిగూఢమైన వైదిక , ఉపనిషత్, పురాణ వాజ్ఞ్మయ సారంతో ముడిపడే ఉంటుంది.ెండు చేతులు జీవాత్మ-పరమాత్మలకు సంకేతం. ఆ రెండూ కలవడం…జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అదే మన జీవిత కాలపు లక్ష్యం. ఎదుట ఉన్న వ్యక్తులకు నమస్కారం చేసేటప్పుడు ,రెండు చేతులను ఒకదానికొకటి ఎదురెదురుగా కలుపుతాం. అంటే నీలోని ఆత్మ , నాలోని ఆత్మ ఒక్కటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి, మనకి భేదం లేదని, మనమంతాఒక్కటే అని చెప్పకనే చెబుతాం. అంతా ఒక్కటిగా మెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ నమస్కారం. మరి దీనికి మూలం.. సామవేద అంతర్గత చాందోగ్యోపనిషత్ సారమైన తత్వమసి అనే మహా వాక్యం. ఈ మహా వాక్యాన్ని అర్థం చేసుకొనే శక్తి కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని ;నమస్కారం అనే సంకేతం ద్వారా వారికి తెలియకుండానే ఆచరింపజేశారు. అయితే ఈ వాక్యం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ముందు రాసి ఉంటుంది. 41 రోజుల కఠోర దీక్షచేసి, పవిత్రమైన ఇరుముడిని శిరస్సును పెట్టుకుని, పావన పదునెట్టాంపడి ఎక్కగానే భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో స్మామికి నమస్కరించే ముందే, నమస్కారానికి మూలమైన తత్వమసి మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని దీని అర్థం. తత్వమసి అనేది సంస్కృత పదం. తత్ + త్వం +అసి అను మూడు పదాల కలయికే తత్వమసి తత్ అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. అది నీవై ఉన్నావు అనేది తత్వమసి వాచ కానికి అర్థం. మాలధరించి, మండల కాలం పాటు దీక్షచేసి, కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో అది నీవై ఉన్నావు నీలోనే పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధ ను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ ప్రబోధ మే తత్వమసి అందుకే పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల లాంటి ప ద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు తత్వమసి పరమార్థం ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.