Devotional

భోగి పండుగ కథ

భోగి పండుగ కథ

‘ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతా దమః’ అన్నది విష్ణు సహస్ర నామం. ధనుస్సే వేదము, ధనుస్సనే వేదము. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు సహస్ర నామములు. సీతాకల్యాం – ధనుర్భంగం జరిగితే గాని జరుగదు. కనుక ధనుర్మాస భంగము జరిగితే, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ‘కోటినదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేవే మనసా’ అన్న తోడిరాగ కీర్తనలో అద్భుతంగా, ధనురాకారముగా నున్న కనుబొమల మధ్య స్థానమునే ధనుష్కోటియని, నదుల వలె ప్రవహించు నాడీ ద్వారములకు, అది కేంద్రమని ధ్యాన యోగ లక్ష్యమని, వర్ణించాడు నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి.
శ్రీరాముడు, శివధనుర్భంగము చేశాడంటే, ఓంకార రూపమైన ధనుస్సును, రాముడు భగ్నం చేయగా, ఓం అ+ఉ=మ్ అనే మూడు వేదములుగా లోకంలో ప్రసారమయి ప్రసిద్ధి చెందినాయి. భంగమంటే తరంగమని మరొక అర్థం ఉన్నది. వేదములు, శబ్ద తరంగములుగా ప్రసారమయినవని అర్థము. ఇదే సీతా కల్యాణము – లోక కళ్యాణమునకు దోహదపడింది.
ఇదే విధముగా, ధనుర్మాసములోని ధనుర్భంగము వలన శీతము భగ్నమై ఉష్ణము ప్రసరిస్తుంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ధనుర్మాసమంటే వేదమాసం. మా, ఆస ‘మాస’ అనగా లక్ష్మి నిండియున్న మాసమని అర్థము. వేదలక్ష్మి, వేదమాత యొక్క శోభతో నిండియున్న మాసమని అర్థము.
బోగిపండుగ నాడు, బోగిమంటలు వేస్తారు. ‘అగ్ని’ సూర్యునికి ప్రతీక. ఋగ్వేదంలో అగ్ని ఆరాధన విశేషంగా చెప్పబడింది. బోగిమంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు, మానవాళి కల్మషాన్ని పటాపంచలు చేస్తాయి. మనలోని పాత దుష్ట్భావాల్ని, దుర్గుణాలను, జ్ఞానమనే మంటల్లో వేసి దహించాలి. బోగి రోజున ఉదయానే్న అభ్యంగన స్నానం చేస్తారు. చిన్నపిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి, బోగిరోజు సాయంత్రం వరుసగా కూర్చోబెట్టి వారి శిరస్సుపై రేగి పండ్లు, బంతిపూల రెక్కలు దిష్టితీసి పోస్తారు. పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. రేగి పండ్లలో సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే, ఆ శక్తి, తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ, బోగిపండ్లని పిల్లలకు శిరస్సుపై పోసే అద్భుతమయిన ఆచారం అనాదిగా వస్తోంది.
గోదారంగ నాథుల కల్యాణం
బోగిపండుగ అనగానే జ్ఞప్తికి వచ్చేది గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం. శ్రీవిల్లిపుత్తూరు నివాసియైన పెరియాళ్వార్ – విష్ణుచిత్తుడు, ఆ ఊరులోనే వేంచేసిన వటపత్రశాయిని, నిత్యం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ, తులసి, పూలమాలలు కట్టి ఆ స్వామికి సమర్పిస్తూ, ఆ కైంకర్యంలో ఆత్మానందాన్ని పొందుతూ సంపూర్ణ శరణాగతి భావంతో, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఒకనాడు తులసీ వనంలో, చెట్లను కుదురులు చేస్తుంటే, ఒక అయోనిజ శిశుప్రాయంలో భగవదత్తంగా లభించింది. బిడ్డలు లేని తనకు, ఆ వటపత్రశాయి, ఆ లోటును తీర్చాడని సంతోషించి, పరమాత్మకు కృతజ్ఞతా భావాన్ని సర్వదా చెప్పుకుంటూ, ఆ బిడ్డకు ‘కోదై’ అనగా పూలమాల అని పేరు పెట్టుకున్నాడు. ‘గో’ అంటే వేదవాక్కులు, భూదేవి అనే అర్థాలున్నాయి. భూదేవి ఆ శిశువును తనకు ప్రసాదించిందని, ‘గోదా’ అని నామకరణం చేశాడు. పూలమాలలను తను మొదటగా ధరించి, తరువాత స్వామి అలంకారానికి పంపించేది కనుక, గోదాదేవికి ‘ఆముక్తమాల్యద’ అని పేరు వచ్చింది. అందరినీ రక్షించే తల్లిగా ‘ఆండాళ్’ అని పిలిచేవారు. తమిళులు ‘శూడిక్కొడుత్తాళ్’ అని పిలుస్తూ పూజిస్తారు. అన్ని పేర్లలోకి ‘గోదాదేవి’ ‘ఆండాళ్’ అనే నామములు ప్రసిద్ధములు.
భక్తి జ్ఞాన వైరాగ్యాలను సహజసిద్ధంగా పొందిన గోదాదేవి, శ్రీరంగనాథుని పతిగా తలంచి, భక్తిశ్రద్ధలతో ఆరాధించి స్వామి అనుగ్రహమును పొంది, మకర సంక్రమణం, సంక్రాంతి పండుగకు వెనుక రోజైన బోగిపండుగ నాడు శ్రీరంగనాథుని వివాహమాడుతుంది. ముప్పది రోజులపాటు మార్గళీ వ్రతాన్ని ఆచరించి, సంపూర్ణ శరణాగతితో గోదాదేవి కీర్తించిన ముప్పది పాశురముల రూపమే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధము. ‘తిరు’ అంటే శుభప్రదమైన, శ్రీప్రదమైన, ‘పావై’ అంటే నోము (లేక) వ్రతం – అదే మేలినోము, సిరినోము.
బోగిపండుగ – బలి చక్రవర్తి: వామనావతారం
బలిచక్రవర్తిని, శ్రీమహావిష్ణువు వామన రూపంలో, పాతాళానికి పంపిన పర్వదినమే బోగి పండుగ, అని చెప్తారు పెద్దలు. మూడడుగుల స్థలం ఇవ్వవలసినదిగా కోరుతాడు, వామనావతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు. మూడడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను, జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలను, సత్వ రజ తమోగుణములను, దారేషణ పుత్రేషణ ధనేషణలను హరింప చేసికొన్నాడు – బలిచక్రవర్తి. ఇది బోగి పండుగకు దీప్తినిస్తుంది.
సూర్యగమనం
సూర్యగమనాన్ని ‘బోగి’మంటారు. ధనూరాశి నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు, ప్రకృతిలో మార్పు స్పష్టంగా దృశ్యమవుతుంది. చండ మార్తాండ మండలములో ప్రచండ తేజస్కుడైన సూర్యుడు, నవ్యకాంతిని ప్రజ్వలింపజేస్తూ ప్రకాశిస్తాడు. రాత్రి సమయం తక్కువయి, క్రమేపీ పగటి కాలం ఎక్కువవుతుంది. నూతన తేజోత్సాహాన్నిస్తుంది – మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ‘షూణీ ప్రేరణే సువతి ప్రేరయతి వ్యాపారేషు ఇతి సూర్యః’ మనం చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని జ్ఞప్తి చేస్తూ, ప్రేరణ నిచ్చి మనచేత ఆ కార్యాన్ని చేయించటానికి శక్తినిచ్చేవాడు – సూర్యభగవానుడు.
తెలుగు వెలుగు కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు