Business

5వేల కోట్లకు పైగా లాభం గడించిన ఇన్ఫోసిస్-వాణిజ్యం

5వేల కోట్లకు పైగా లాభం గడించిన ఇన్ఫోసిస్-వాణిజ్యం

* వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.22 శాతానికి తగ్గింది. నవంబర్లో ఇది 1.55%, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌కు 0.92 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. డిసెంబర్లో కూరగాయాల టోకు ధరలు (-) 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. నవంబర్లో ఇది 12.24 శాతంగా ఉండేదని వెల్లడించింది. నవంబర్లో 115.12 శాతంగా ఉన్న బంగాళాదుంపల ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు 37.75 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలతో పోలిస్తే వరి, ధాన్యాలు, గోధుమలు, పప్పుల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో మరింత తగ్గింది.

* సంక్రాంతి పండగ రోజున దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. బుధవారం నాటి నష్టాల నుంచి కోలుకుని సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 92 పాయింట్లు లాభపడి, 49,584 వద్ద ముగియగా, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,595 వద్ద స్థిరపడింది.

* దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌, మార్కెట్‌ వర్గాల అంచనా కంటే మెరుగైన ఫలితాలతో మెప్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు)లో కంపెనీ రూ.5,197 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.4,457 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 16.6 శాతం అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం సైతం 12.3 శాతం వృద్ధితో రూ.25,927 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.23,092 కోట్లుగా నమోదైంది.

* దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ చిక్కుముడిగా మారింది. దీనికి ‘సబ్సిడరీ’గా ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనే జీవిత బీమా కంపెనీ ఉండటం ఇందుకు నేపథ్యం. ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌) చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను సొంతం చేసుకోడానికి పలు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇందులో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి దేశీయ సంస్థలతో పాటు, అమెరికాకు చెందిన ఏఐఎఫ్‌ (ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) అయిన ఓక్‌ట్రీ ఉన్నాయి. మనదేశంలోని జీవిత బీమా కంపెనీల్లో విదేశీ సంస్థల పెట్టుబడి 49 శాతానికి మించడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో విదేశీ సంస్థ అయిన ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు 49 శాతం వాటా ఉంది. దివాలా పరిష్కార ప్రక్రియలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను విదేశీ సంస్థలు సొంతం చేసుకోడానికి ఇదొక అవరోధం అవుతుందనే వాదన వినవస్తోంది. ఏదైనా విదేశీ సంస్థ చేతికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెళ్తే, దానికి పరోక్షంగా ప్రమరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లో 51 శాతం వాటా దక్కినట్లు అవుతుంది. అదే జరిగితే విదేశీ పెట్టుబడి నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాథికార సంస్థ) వివరణ కీలకంగా మారనుంది.