DailyDose

ఒప్పుకున్న అఖిలప్రియ-నేరవార్తలు

ఒప్పుకున్న అఖిలప్రియ-నేరవార్తలు

* గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో కొలువైన శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాలయంలో బుధవారం రాత్రి 11:30 గంటల వరకు గ్రామోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. గేట్లు, తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు…మల్లిఖార్జున స్వామికి ఇరువైపుల ఆసీనులైన భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న తాళి బొట్లు, ముక్కు పుడకలను అపహరించారు. గురువారం ఉదయం పూజలు చేయడానికి కోవెల వద్దకు వచ్చిన పూజారి నాగమల్లేశ్వర శర్మ చోరీ ఘటనను గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సింగయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

* ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవాళ ముగిసింది. అంతకుముందు బేగంపేటలోని పీహెచ్‌సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల తర్వాత ఆమెను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం మరోసారి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అఖిలప్రియ తరఫున ఆమె న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 16వ తేదీన న్యాయస్థానం విచారణ జరపనుంది. మూడు రోజుల విచారణలో భాగంగా అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు భూవివాదానికి సంబంధించి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా… ప్రవీణ్ రావు సోదరుల నుంచి స్పందన లేకపోవడంతో అపహరణకు పాల్పడినట్లు అఖిలప్రియ పోలీసుల వద్ద తెలిపినట్టు సమాచారం. మొదట అపహరణకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రశ్నించినా…. తనకు తెలియదని దాటవేసిన అఖిలప్రియయ, పోలీసులు చూపించిన ఆధారాలతో ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకున్నట్లు సమాచారం. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా బోయిన్ పల్లి వెళ్లి అపహరణను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. వీరికోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. హఫీజ్ పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన దాదాపు 33 ఎకరాల భూమిని ఆయన బినామీ ఏవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించేవారు. 2005లో కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా నియమించుకున్నారు. న్యాయవాది కృష్ణారావు మరణంతో… ఆయన కుమారుడు ప్రవీణ్ రావు, మేనల్లుడు సునీల్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ భూమి విషయంలో పలు న్యాయ వివాదాలు ఉండటంతో 2015లో ఏవీ సుబ్బారెడ్డి… ప్రవీణ్ రావు సోదరుల నుంచి నగదు తీసుకొని బయటికి వెళ్లిపోయాడు. ఈ విషయం అఖిల ప్రియకు తెలియడంతో కొంత కాలంగా ప్రవీణ్ రావుతో పాటు వాళ్ల భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. భూమా నాగిరెడ్డికి చెందిన భూమిని ఎలా సొంతం చేసుకుంటారని, వాటా ఇవ్వాల్సిందిగా కోరింది. నిరాకరించడంతో అపహరణ చేసి… బలవంతంగా భూమిని రాయించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.

* ద్విచక్రవాహనంపై వెళ్తు్న్న వారిని కారు ఢీకొన్న ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చింతూరు మండలం చట్టి వద్ద రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు చింతూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (26), సీతయ్య(48)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* ఈ నెల 8న న్యాల్‌కల్‌ మండలం బసంత్‌పూర్‌ శివారులోని చెక్‌డ్యాంలో లభించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజు, గ్రామీణ సీఐ కృష్ణకిషోర్‌, హద్నూర్‌ ఎస్సై విజయరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లు, చేతులు, మొండెం వేరుచేసి ఓ సంచిలో మూటగట్టి చెక్‌డ్యాంలో పారేసిన మృతదేహం కర్ణాటకలోని అష్టూర్‌ గ్రామానికి (మన రాష్ట్ర సరిహద్దు గ్రామం) చెందిన వైద్యనాథ్‌ (57)గా గుర్తించినట్లు తెలిపారు. భార్య పుణ్యమ్మకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ.. తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో పాటు గ్రామంలో ఈ విషయం ప్రచారం చేయడంతో కుటుంబం పరువు పోతుందని విసుగు చెందిన భార్య, కుమారులతో కలిసి హత్య చేసింది. డిసెంబరు 31న వైద్యనాథ్‌ను ఇంటిలో బంధించి.. తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం తల, కాళ్లు, చేతులు వేరు చేసి ఓ సంచిలో కుక్కి రాష్ట్ర సరిహద్దు దాటి వచ్చారు. బసంత్‌పూర్‌ శివారులోని చెక్‌డ్యాంలో పారేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు కలిసి ఈ హత్యకు పాల్పడగా బుధవారం సంతోష్‌, అనుకేష్‌లను అరెస్టు చేయగా భార్య పుణ్యమ్మతో పాటు కుమారులు అంకుష్‌, ఆకాశ్‌ పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

* తన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగిని కువైట్‌లో ఉద్యోగం పేరిట రూ.2లక్షలకు విక్రయించాడో వైద్యుడు. పోలీసుల కథనం ప్రకారం… టోలిచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం (40) ఆరోగ్య రీత్యా గోల్కొండ కోటోరా హౌస్‌ వద్ద ఉన్న షిఫా క్లినిక్‌ వైద్యుడు షబ్బీర్‌హుస్సేన్‌ వద్దకు వచ్చేది. ఈ క్రమంలో కువైట్‌లో ఓ ఇంట్లో పని మనిషిగా చేరితే నెలకు రూ.25వేలు సంపాదించవచ్చని తెలిపాడు. తన కుమార్తె వివాహ నిమిత్తం అప్పుల్లో ఉన్న తాహేరాబేగం అందుకు అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరి 3న ఆమె కువైట్‌కు పయనమైంది. అక్కడ షబ్బీర్‌హుస్సేన్‌ తమ్ముడు తాహేరాబేగంను కలవాగా అల్‌ షమారీ అనే వ్యక్తి ఇంట్లో పనిలో కుదిర్చాడు. కొద్ది రోజులుగా అల్‌షమారీ తాహేరాబేగంకు తినేందుకు సరైన ఆహారం సైతం ఇవ్వడం లేదు. దీంతో తాహేరాబేగం తనను తిరిగి ఇండియాకు పంపాలని అల్‌షమారీని వేడుకోగా షబ్బీర్‌హుస్సేన్‌కు రూ.2లక్షలు చెల్లించి ఆమెను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తాహేరాబేగం తన కుమార్తె తరన్నుం బేగంకు చెప్పి విలపించింది. ఆమె విషయాన్ని ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్‌ దృష్టికి తెచ్చింది.

* అర్ధరాత్రి 11.30 గంటలకు బొలేరో వాహనంలో బయలుదేరుతారు. తెల్లవారుజామున 3 గంటల వరకే చోరీలు చేస్తారు. నాటు తుపాకీతో కాపలాదారులను బెదిరిస్తారు. వరుస చోరీలతో సైబరాబాద్‌ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన అంతరాష్ట్ర దోపిడి ముఠా ఎట్టకేలకు చిక్కింది. వివరాలను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. దుండిగల్‌ ఠాణా మల్లంపేట్‌లో నిర్మాణంలో ఉన్న ప్రణీత్‌ ప్రణవ్‌ లీఫ్‌ విల్లాస్‌లో ఈ నెల 9న అర్ధరాత్రి రూ.24 లక్షల విలువైన విద్యుత్‌ సామగ్రి చోరీకి గురయ్యింది. ఈ నెల 12న అర్ధరాత్రి దుండిగల్‌ టోల్‌ గేట్‌ దగ్గర వాహనాల తనిఖీ సమయంలో ఆగకుండా వెళ్లిన బొలెరో వాహనాన్ని మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర పట్టుకున్నారు. తనిఖీ చేయగా నాటు తుపాకీ, కట్టెలు, తాళ్లు, ఇతరత్రా సామాగ్రి, సీటు లోపల దాచిపెట్టిన డబ్బు లభించింది. రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్‌ కుష్వాహా(27), కుల్దీప్‌(23)తో పాటు యూపీవాసి శైలేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మల్లంపేట్‌లో చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. శంకర్‌పల్లి, ఆర్సీపురం, నార్సింగి ఠాణాలో పరిధిలోని మరో ఆరు చోట్ల కూడా దొంగతనం చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురిచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్‌కు చెందిన మాధవ్‌ సింగ్‌(29), ధర్మేందర్‌ సింగ్‌(32), సంజయ్‌(21), ఉత్తరప్రదేశ్‌వాసులు నిహాల్‌ సింగ్‌(22), శైలేంద్రసింగ్‌(22), ధర్మేంద్ర కుమార్‌(26), సత్యభన్‌ సింగ్‌(23)ను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తును కొనుగోలు చేసిన కొండాపూర్‌లోని దీపక్‌ ఎలక్ట్రికల్స్‌ యజమాని మనీష్‌ కుమార్‌, స్క్రాప్‌ డీలర్‌ గోవుల విజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా గతంలో దిల్లీలో ఎలక్ట్రీషియన్లుగా పనిచేశారు. అక్కడ చోరీలు చేసి జైలుపాలయ్యారు. ఆ తర్వాత 2019లో హైదరాబాద్‌కొచ్చారు. నిందితులు ఈ నెల 6న శంకర్‌పల్లి ఠాణా పరిధిలోని మోఖిల్లాలో రూ.5 లక్షలు, 8న తెల్లాపూర్‌లో రూ.2.2 లక్షలు, 9న మల్లంపేట్‌లో రూ.24 లక్షల విలువైన విద్యుత్‌ సామాగ్రిని దొంగిలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్లు వెంకటేశం(దుండిగల్‌), ప్రవీణ్‌రెడ్డి(మేడ్చల్‌), రమణారెడ్డి(బాలానగర్‌ ఎస్వోటీ), వెంకట్‌రెడ్డి(శంషాబాద్‌ ఎస్వోటీ), ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి(దుండిగల్‌ పీఎస్‌)ని సజ్జనార్‌ అభినందించారు.

* భర్తతో గొడవపడి నిప్పుంటించుకున్న భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు ఆమె భర్త. ఈ ప్రయత్నంలో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతై మృతి చెందారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. దీంతో పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లేశ్‌(42), సునీత(32)లు దంపతులు. గత కొంతకాలంగా ఎల్లేశ్‌ మద్యానికి బానిసవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

* హిందూ దేవుళ్లను కించపరిచేలా, భిన్నవర్గాలమధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్‌ చక్రవర్తిని (33) సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సింగ వెంకటశ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌పై తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులున్నాయని, సీఐడీ పరిధిలోని సైబర్‌ నేరాల విభాగం పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ బుల్లిషీట్‌ కూడా ఉందని సీఐడీ పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐడీ విబాగాధిపతి పీవీ సునీల్‌ కుమార్‌ హెచ్చరించారు.