Business

బంగారం ధర పెరిగింది-వాణిజ్యం

బంగారం ధర పెరిగింది-వాణిజ్యం

* గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. రూ.286 పెరగడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 48,690కి చేరింది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. రూ. 558 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 65,157 పలికింది. క్రితం రెండు సెషన్లలో బంగారం ధర రూ. 500పైనే తగ్గడం గమనార్హం.

* రుణ యాప్​లపై కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులుఆన్​లైన్ రుణ సంస్థల నియంత్రణ కోసం దాఖలైన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో కేంద్రానికి, ఆర్​బీఐకి తాఖీదులు జారీ చేసింది.ఆన్​లైన్​ రుణ సంస్థలను నియంత్రించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ అంశంపై కేంద్రం, భారతీయ రిజర్వు బ్యాంక్​ (ఆర్​బీఐ) అభిప్రాయాలను తెలపాలని న్యాయస్థానం సూచించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టిస్ జ్యోతి సింగ్​తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.రుణ యాప్​ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆర్​బీఐ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది.నియంత్రణ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు, క్రమబద్ధీకరించని డిజిటల్ రుణాలపై అధ్యయనం కోసం వర్కింగ్ గ్రూప్​ను ఏర్పాటు చేసింది.ఈ సంస్థలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మార్గదర్శకాల రూపకల్పనపై ఈ వర్కింగ్‌ గ్రూపు సూచనలు చేయనుంది.

* దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. గత ఏడాది మార్చిలో కరోనాతో దేశంలో భయం మొదలైంది. జూన్, జులై నాటికి కరోనా పీక్ పాయింట్‌కు చేరుకుంది. మందులేని నయాన్ని ఎలా నయం చేయాలో తెలియక డాక్టర్లు, దాని బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఈ లోపే దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటిపోయింది.

* మరో ఐదు రోజుల్లో అధికారం అప్పగించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివర్లో చైనాకు షాకుల మీద షాకులిస్తున్నారు. తన ఓటమికి కారణాల్లో చైనా కూడా ఒకటని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆయన వ్యూహాలు రెండువైపులా పదునున్న కత్తిని తలపిస్తున్నాయి. పదవి నుంచి దిగే సమయంలో చైనా కంపెనీలను ఆయన లక్ష్యంగా చేసుకొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దాదాగిరీ చేసినందుకు ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులపై నిషేధం విధించారు. అంతేకాదు పలువురు కీలక వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించారు. చైనా కంపెనీలకు మాత్రం కీలకమైన టెక్నాలజీ అందడం ఇక ముందు మరింత కష్టంగా మారనుంది. ఇప్పటి వరకు కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌ దీనిపై స్పందించలేదు. 2016 ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఒబామా కూడా ఇటువంటి ఆంక్షలను గతంలో విధించారు. ఇప్పుడు ట్రంప్‌ అదే శైలిని అనుసరిస్తున్నారు.

* ఆన్‌లైన్‌ రుణాలు ఇస్తూ రుణగ్రహీతలపై వేధింపులకు పాల్పడుతున్న యాప్స్‌పై గూగుల్‌ ఇండియా చర్యలు తీసుకుంది. పదుల సంఖ్యలో రుణ యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. పలు యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకున్న వారిపై అధిక వడ్డీలు విధించి రుణం చెల్లించాలని వేధింపులకు గురిచేస్తుండటంతో ఇటీవల పలువురు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇలాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటికే ఇలాంటి దారుణాలకు పాల్పడే పలు యాప్‌ల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌బీఐ నిబంధనలను ఈ యాప్స్‌ ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడించారు.

* భారత్‌లో బెంజికార్లను ఆన్‌లైన్‌లో కూడా కొనేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది. ఈ కంపెనీ ఆన్‌లైన్‌ సేల్స్‌ 14శాతం వరకు ఉండటం విశేషం. గతేడాది బెంజ్‌ విక్రయాలు దాదాపు 42శాతం తగ్గాయి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌వంటివి దీనికి కారణంగా నిలిచాయి. కానీ, ఏడాది చివర్లో కంపెనీ పుంజుకొని కొవిడ్‌ ముందు నాటి స్థాయికి విక్రయాలను చేర్చింది. మొత్తం 7893 వాహనాలను విక్రయించింది.

* స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ఉండటం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. క్రితం సెషన్లో కొత్త గరిష్ఠాలను చేరుకున్నప్పటికీ.. నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం 9.52 నిమిషాలకు సెన్సెక్స్‌ 266 పాయింట్ల నష్టంతో 49,317 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టంతో 14,515 వద్ద కొనసాగుతున్నాయి.

* దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో దేశీయంగా దిగ్గజ షేర్లు కుదేలవడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం సూచీల పతనానికి కారణమైంది.