Agriculture

395వ రోజుకు చేరిన అమరావతి ఆందోళన-తాజావార్తలు

News Roundup - Amaravathi Protests Reach 395th Day

* రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 395వ రోజుకి చేరుకున్నాయి.మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు.

* రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 94 కొత్త కేసులు నమోదయ్యాయి.వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,710 కు చేరింది.తాజాగా వైరస్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,139కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.తాజాగా 232 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది.వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,76,372కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,199 యాక్టివ్‌ కేసులున్నాయి.

* నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్‌పార్టీ వెనక్కి తగ్గేదే లేదని ఆ పార్టీ నేత రాహుల్ ‌గాంధీ స్పష్టం చేశారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన రాజ్‌భవన్‌ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా దిల్లీలో నిర్వహించిన నిరసనలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ పాల్గొన్నారు.

* రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదు అన్న ప్రచారం శుద్ధ అబద్ధం.ఇది కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని చేస్తున్న ప్రచారం మాత్రమే.గత సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే 2020 లో దేవాలయ సంబంధిత ఘటనల సంఖ్య లో ఎటువంటి పెరుగుదల కనిపించలేదు.కానీ ప్రతి సంఘటన తరువాత రాజకీయ పార్టీల దుష్ప్రచారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.అదికూడా ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తిరపరచాలనే దురుద్దేశం కనిపిస్తూ ఉంది.దేవాలయాలకు సంబందించిన 44 ఘటనలలో 29 కేసులు చేదించి 81 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఇదివరకే పత్రికా ముఖంగా తెలియచేయడం జరిగింది.అంతే కాకుండా ఆలయాల భద్రతకు తీసుకొంటున్న చర్యల గురించి కూడా సవివరంగా తెలియ చేయటం జరిగింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. వీరిలో మహిళా ఓటర్లు 2,04,71,506 ఉండగా.. పురుష ఓటర్లు 1,99,66,737 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 66,844 మంది, థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు పేర్కొంది. 2021 జనవరి నాటికి రాష్ట్రంలో కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎస్‌ఈసీ తెలిపింది.

* దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. గత ఏడాది మార్చిలో కరోనాతో దేశంలో భయం మొదలైంది. జూన్, జులై నాటికి కరోనా పీక్ పాయింట్‌కు చేరుకుంది. మందులేని నయాన్ని ఎలా నయం చేయాలో తెలియక డాక్టర్లు, దాని బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఈ లోపే దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటిపోయింది.

* తిరుపతి సమీపంలోని పెరుమాళ్ల పల్లి వద్ద ఎస్వీ నగర్ స్మశానం వద్ద వాహనం లోకి లోడ్ చేస్తున్న 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ ‘ సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ ‘ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్‌-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ” జనవరి 15 వ తేదీన ” – ” ఆర్మీ డే ” ని నిర్వహిస్తారు . ఆ రోజున దేశ రాజధానిలో ఆరు ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు , ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తారు . నేడు ఢిల్లో 70 వ ఇండియన్‌ ఆర్మీ డే ని నిర్వహించబడుచున్నది
మనదేశ ప్రజల పరిరక్షణకోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భం గా నివాళులర్పిస్తారు. భారత దేశ ప్రజాస్వామ్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎంతటి ముఖ్యమయిన పాత్రనయితే పోషించారో , భారత సైన్యము కూడా అంతే సమానపాత్ర వహించినది . జనరల్ కోదండర మాదప్ప కరియప్ప స్వదేశీయులతోను , బ్రిటిషర్లతోనూ సత్సంబంధాలు కలిగివుండి జనరల్ రాయ్ బచ్చర్ నుంచి తొలికమాండర్ ఇన్‌-చీప్ గా బాధ్యతలు స్వీకరంచిన తర్వాత సైన్యము సరిహద్దుల్లోను , ప్రకృతి వైపరీత్యాలలోనూ అనేకవిధాల పోరాడింది . పోరాడుతూనే ఉంది .

* అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం ఇచ్చారు. కాగా.. వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్‌లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణం కోసం కోట్లలో విరాళాలివ్వడం విశేషం.

* ఒంటెను ఢీకొని బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్‌ మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఈ ప్రమాదం జరగగా తాజాగా పోలీసులు వివరాలు వెల్లడించారు. కింగ్‌ రిచర్డ్‌ శ్రీనివాసన్‌ బెంగళూరులో బైకర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల అతడు తన ముగ్గురు స్నేహితులో కలిసి బైక్‌పై రాజస్థాన్‌ పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలో జైసల్మేర్‌కు వెళ్తుండగా.. ఫతేగఢ్‌ వద్ద బుధవారం రాత్రి శ్రీనివాసన్‌ బైక్‌కు ఒంటె అడ్డువచ్చింది. దీంతో బైకు అదుపుతప్పి ఒంటెను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసన్‌ తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు గురువారం మృతదేహానికి పోస్టుమార్టం చేసి, అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.

* ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.. అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్‌ఫోన్‌ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని లోధ అపార్ట్‌మెంట్ వరకు ఆమె రెండు చరవాణిల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు.

* దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశంసించారు. ఆర్మీ డే (జనవరి 15) భారతీయులందరికీ పుణ్యదినమన్నారు. వీర జవానుల త్యాగాలను త్రికరణశుద్ధిగా స్మరించుకొనే రోజు ఇదేనన్నారు. ఈ దేశాన్ని కాపాడే వీర పుత్రులకు తన తరఫున, జనసేన తరఫున జేజేలు పలుకుతూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

* మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కీలక సమయంలో అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరిస్తున్న భాజపాలో చేరుతున్నారు. దీంతో తృణమూల్‌ – భాజపా నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎంపీ శతాబ్ది రాయ్‌ కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆమె రేపు దిల్లీకి వెళ్తున్నట్టు పేర్కొంటూ చేసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది.

* యూట్యూబర్లు తమ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసిన నెటిజన్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే వారు ఏది చెప్పినా నెటిజన్లు నిజమని నమ్మే అవకాశాలు ఎక్కువ కాబట్టి. సామాజిక బాధ్యతతో ఏ వీడియోనైనా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని పోస్టు చేయాలి. ఏ కాస్త నిర్లక్ష్యం వహించినా, అది పెద్ద తప్పిదానికి దారితీయొచ్చు. అలాంటి సంఘటనే దక్షిణకొరియాలో ఓ యూట్యూబర్‌ వల్ల జరిగింది. ఒక హోటల్‌పై అతడు ప్రతికూల రివ్యూలు ఇవ్వడంతో అది కాస్తా వైరల్‌గా మారి ఏకంగా హోటల్‌ మూసివేతకు దారితీసింది. తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న యూట్యూబర్‌ నాలుక్కర్చుకున్నాడు.