Politics

ప్రధాన నిందితులు తప్ప అందరూ దొరికారు

ప్రధాన నిందితులు తప్ప అందరూ దొరికారు

ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, గుంటూరు శీను, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌ పరారీలో ఉన్నారని.. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని సీపీ చెప్పారు. కిడ్నాప్‌ కేసులో ఈ నెల 6న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌ కోర్టు ఆదేశాలతో అఖిలప్రియను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. కస్టడీ ముగియగానే ఈ నెల 14న కోర్టులో హాజరుపరిచారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీలో సేకరించిన కీలక సమాచారంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.. అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్‌ఫోన్‌ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అఖిలప్రియ ఉపయోగించిన రెండు చరవాణిలు ఆమె ఇంట్లోనే ఉండిపోవడంతో, వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.