Politics

విజయవాడ గురించి ఎవరికీ పట్టదా?

రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలకు చుట్టపక్కల ప్రాంతాల్ని, గ్రామాల్ని వాటిలో విలీనం చేస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన విజయవాడ విషయంలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని విలీనం చేస్తూ.. విజయవాడలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాల్ని మాత్రం నగరపాలక సంస్థలో కలపకుండా ముక్కలుగా విభజిస్తోంది. విజయవాడను మహానగరంగా మార్చాలన్న ఆకాంక్షలకు గండి కొడుతోంది. అన్ని అర్హతలు, అవకాశాలున్నా విజయవాడను గ్రేటర్‌గా మార్చడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఏ ప్రయోజనాల కోసం ముక్కలు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడలో అంతర్భాగంగానూ, చుట్టుపక్కలున్న పంచాయతీల్ని కలిపి ‘గ్రేటర్‌ విజయవాడ’గా మార్చాలన్న ప్రతిపాదన పదిహేనేళ్లుగా నానుతోంది. విజయవాడలోనూ, చుట్టుపక్కలున్న 14 గ్రామాల్ని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) పరిధిలోకి తేవాలని 2005లోనే తీర్మానం చేశారు. తర్వాత ఆ సంఖ్య 30కి, 45కి, 51కి పెరిగింది. కానీ ఒక్క గ్రామాన్నీ విలీనం చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని కుదించి మైలవరం, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని 29 గ్రామాల్ని విలీనం చేసేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. దాన్నీ ఇప్పుడు పక్కన పెట్టేశారు. గ్రేటర్‌ విజయవాడపై గత ప్రభుత్వం ప్రతిపాదనలతోనే అయిదేళ్లూ కాలం గడిపేసింది. 30 గ్రామాలను కలుపుతామని ఒకసారి, 45 గ్రామాల విలీనమంటూ మరోసారి.. రకరకాల ప్రతిపాదనలు చేసిందే తప్ప ఒక్క గ్రామాన్నీ విలీనం చేయలేదు. విజయవాడ, గుంటూరుల్ని కలిపి మెగా పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేస్తామని అదీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ‘గ్రేటర్‌’ ప్రతిపాదనను పూర్తిగా పక్కకు నెట్టేసి నగరాన్ని ఖండఖండాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాల్ని నగరంలో కలపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ఏడాది క్రితం ఇబ్రహీంపట్నాన్ని ప్రత్యేక మున్సిపాలిటీ చేసింది. విజయవాడలో భాగమైపోయిన యనమలకుదురు, తాడిగడప, పోరంకి, కానూరుల్ని కలిపి ప్రత్యేక మున్సిపాలిటీగా చేస్తూ తాజాగా ఆర్డినెన్స్‌ ఇచ్చింది. నగరాన్ని ఇలా ముక్కలు చేస్తూ.. ఎక్కడికక్కడ చిన్న చిన్న మున్సిపాలిటీలు చేసుకుంటూ పోతూ ‘గ్రేటర్‌’ ఆశల్ని ఎప్పటికీ సమాధి చేయాలనుకుంటున్నారా అనే విమర్శలు ప్రజల నుంచీ వస్తున్నాయి.

అక్కడో రూలూ… ఇక్కడో రూలా..?
* తాజా ఆర్డినెన్స్‌లో.. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం నగరాలు, మంగళగిరి, తాడేపల్లి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, బాపట్ల, పొన్నూరు, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, గుడివాడ పట్టణాల్లో చుట్టుపక్కలున్న పలు గ్రామాల్ని విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* గుంటూరు జిల్లాలోని మంగళగిరి మున్సిపాలిటీలో ఆత్మకూరు, నవులూరు, బేతపూడి, యర్రబాలెం, చినకాకాని, నిడమర్రు, నూతక్కి, కాజ, చినవడ్లపూడి, రామచంద్రపురం, పెదవడ్లపూడి గ్రామాల్ని విలీనం చేశారు. అవన్నీ మంగళగిరి పట్టణానికి 2 నుంచి 10 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. మంగళగిరికి, రామచంద్రపురానికి మధ్య దూరం 10 కి.మీ.లు.
* తాడేపల్లిలో పాతూరు, వడ్డేశ్వరం, పెనుమాక, ఇప్పటం, మల్లంపూడి, చిర్రావూరు, గుండెమెడ, ఉండవల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల్ని విలీనం చేశారు. చిర్రావూరు.. తాడేపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
* రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో తొర్రేడు, కాతేరు, రాజవోలు, వెంకటనగరం, శాటిలైట్‌నగర్‌, వేమగిరి, హుకుంపేట, బొమ్మూరు, ధవళేశ్వరం, పిడింగొయ్యి గ్రామాల్ని విలీనం చేశారు. అవన్నీ నగరానికి 1.3 – 8 కి.మీ.ల దూరంలో ఉన్నాయి.
* కుశాలపురం, తోటపాలెం, పెద్దపాడు, చాపారం, కిల్లిపాలెం, ఖాజీపేట, పాత్రునివలస గ్రామాల్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కలిపారు. అవన్నీ నగరానికి 2 కి.మీ.ల నుంచి 5 కి.మీ దూరంలో ఉన్నాయి.
* 2005లోనే గాజువాక మున్సిపాలిటీని, దూరంగా ఉన్న 32 పంచాయతీల్ని కలిపి విశాఖను గ్రేటర్‌ విశాఖ చేశారు. తర్వాత అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల్ని, మరిన్ని గ్రామాల్నీ విలీనం చేస్తూ.. గ్రేటర్‌ విశాఖ పరిధిని మరింత పెంచారు.
* ఏడెనిమిదేళ్ల క్రితమే గుంటూరు చుట్టుపక్కలున్న 10 గ్రామాల్ని నగరపాలక సంస్థ పరిధిలోకి తెచ్చారు.
* రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో చుట్టుపక్కలున్న ప్రాంతాల్ని, గ్రామాల్ని విలీనం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించాలనుకున్నప్పుడు, విజయవాడ విషయంలో అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అదే విధానాన్ని ఇక్కడ ఎందుకు వర్తింపజేయడం లేదు?

*** భారీగా పోలీసు కమిషనరేట్‌ పరిధి
విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధి 1211.16 చదరపు కిలోమీటర్లు. నగరంతో పాటు చుట్టుపక్కలున్న ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లోని 179 గ్రామాలూ దీని పరిధిలోనే ఉన్నాయి. 1983లోనే విజయవాడ కేంద్రంగా ప్రత్యేక అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం చుట్టుపక్కల ప్రాంతాల్ని విలీనం చేస్తూ 1989లో దాన్ని ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. నగరపాలక సంస్థకు ఆ సూత్రం వర్తించదా?

*** అన్ని అర్హతలూ ఉన్నా ఎందుకు చేయరు?
రాష్ట్రానికి నడిబొడ్డున, కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉంది. తాగునీటికి కొరత లేదు. పెద్ద రైల్వే జంక్షన్‌, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖ వంటి నగరాలకు మధ్యలో ఉంది. రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి. అన్నింటికీ మించి నగరం పక్కనే రాజధాని అమరావతి ఉంది. నగరంలోనూ, చుట్టుపక్కల చాలా విద్యా సంస్థలున్నాయి. ఆస్పత్రులున్నాయి. ఇలా అన్ని అర్హతలూ ఉన్నా విజయవాడను ఎందుకు మహానగరం చేయడం లేదు? 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా 10.39 లక్షలు. నగర పరిధి 61.88 చదరపు కిలోమీటర్లు. తాజాగా ప్రతిపాదించినట్టుగా 29 గ్రామాల్ని విలీనం చేస్తే నగర పరిధి 344.4 చ.కి.మీ.లకు, జనాభా 13.66 లక్షలకు పెరిగేది. తాడేపల్లి, మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు దైనందిన అవసరాల కోసం బెజవాడపైనే ఆధారపడతారు. కానీ అవీ విజయవాడలో కలవడం లేదు.

*** నగరంలో ఉన్నా.. పంచాయతీలేనా?
విజయవాడ – హైదరాబాద్‌ మార్గంలో భవానీపురం వరకే నగరపాలక సంస్థ పరిధి. ఆ తర్వాత ఉన్న గొల్లపూడి, గుంటుపల్లి వంటివి నగరంలో భాగంగా ఉన్నా ఇప్పటికీ పంచాయతీలే. వాటితోపాటు చుట్టుపక్కలున్న రాయనపాడు, పైడూరిపాడు వంటి పంచాయతీల్ని కార్పొరేషన్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలున్నా ఆచరణలోకి రాలేదు.ఏలూరు నుంచి వచ్చేటప్పుడు.. గన్నవరం నుంచే విజయవాడ మొదలవుతుందని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి వీఎంసీ పరిధి రామవరప్పాడు రింగు వరకే. అక్కడి నుంచి గన్నవరానికి మధ్యలో ఆరు పంచాయతీలున్నాయి.

*** ఆ ఆశలూ ఆవిరే
ఒక మహానగరం రెండు జిల్లాల్లో విస్తరించి ఉండటం కొత్తేమీ కాదు. కృష్ణా జిల్లాలో విజయవాడ చుట్టుపక్కలున్న గ్రామాలతో పాటు, అటు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్ని విజయవాడలో విలీనం చేస్తే రాష్ట్రంలోనే పెద్ద నగరంగా, గ్రేటర్‌ సిటీగా ఎదిగేది. పదిహేనేళ్ల క్రితం జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి అర్హత సాధించేందుకు విజయవాడ జనాభా తక్కువగా ఉండటంతో తాడేపల్లి, మంగళగిరిని కలిపి చూపించి పథకానికి అర్హత సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరలి వచ్చినవారితో విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో జనాభా సుమారు 20 శాతం పెరిగిందని అంచనా. విజయవాడ చుట్టుపక్కల 51 గ్రామాలతోపాటు, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్ని విలీనం చేస్తే జనాభా సుమారు 20-25 లక్షలకు, నగర పరిధి 547 చ.కి.మీ.లకు పెరిగేది. అయితే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ప్రత్యేక నగరపాలక సంస్థగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ రెండూ విజయవాడలో కలుస్తాయన్న ఆశలూ ఆవిరయ్యాయి.

*** మహానగరమైతే ప్రయోజనాలివీ..

* నగర పరిధిలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికీ, ప్రణాళికల రూపకల్పనకు వీలుంటుంది. ఉన్నత విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఇలా ఒక్కోటీ ఒక్కో ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి.
* దేశ, విదేశాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఐటీ, ఇతర సేవారంగాలకు చెందిన సంస్థలు, పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ పెరుగుతుంది.
* ప్రధాన నగరానికీ, శివారు ప్రాంతాలకు మధ్య వసతులు, సౌకర్యాల కల్పనలో అసమానతల్ని తొలగించవచ్చు. అన్ని ప్రాంతాల్నీ కలుపుతూ మెరుగైన రవాణా వసతులు కల్పించవచ్చు.
* తాగునీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థల వంటివి శివారు ప్రాంతాలకు విస్తరించవచ్చు.
* నగర విస్తీర్ణం, జనాభా సంఖ్య ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద ప్రత్యేకంగా నిధులు మంజూరవుతాయి.
* ‘గ్రేటర్‌ విజయవాడ’గా మారితే.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కమిషనర్లుగా నియమిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపడం, నగరానికి వివిధ పథకాల్ని మంజూరు చేయించుకోవడంలో చొరవ తీసుకుంటారు.

*** కాకపోతే నష్టాలివీ..

* విజయవాడ నగరంలో ఇప్పటికే అంతర్భాగంగా ఉన్న ప్రాంతాల్ని వేరుగా చూడటం వల్ల అభివృద్ధిలో అసమానతలు ఏర్పడతాయి.
* చిన్న చిన్న మున్సిపాలిటీలుగా ఉంటే పురపాలకశాఖ అధికారులను వాటికి కమిషనర్లుగా నియమిస్తారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో మాట్లాడగలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* నగరం మొత్తం ఒకే ఛత్రం కింద లేకపోతే చుట్టుపక్కలున్న మున్సిపాలిటీలు, పంచాయతీలు అభివృద్ధికి దూరంగా, మురికివాడలుగా మారిపోయే ప్రమాదమూ ఉంది.
* ఒకే నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని నగరపాలక సంస్థ పరిధిలో, మరికొన్ని మున్సిపాలిటీల్లో, ఇంకొన్ని పంచాయతీలుగానూ ఉంటే పాలనా వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. అక్రమ నిర్మాణాలు పెరగడానికి, ఇతరత్రా సమస్యలకు దారితీస్తుంది.