Business

₹34వేలు పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు-వాణిజ్యం

₹34వేలు పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు-వాణిజ్యం

* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్‌ ఇటువంటి సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. కొవిడ్‌ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. చివరి సారి 1979లో ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేసింది. కానీ, అప్పట్లో ప్రభావం ఈ స్థాయిలో లేదు. కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల ఫలితంగా ఈ పరిస్థితి నెలకొంది. ఆంక్షలు సడలించిన తర్వాత రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు సాధారణంగా ఉంది. భారత్‌ వేగంగా వృద్ధి చెందాలంటే జీడీపీ 8శాతం చొప్పున పెరగాలి. అప్పుడు గానీ కొవిడ్‌ పూర్వస్థితికి చేరుకోలేం.ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నాలుగు అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో వ్యయం, పెట్టుబడి, ప్రభుత్వ ఖర్చులు, ఎగుమతులు ఉంటాయి. జీడీపీలో ప్రభుత్వ ఖర్చులు కేవలం 13శాతమే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రజలు పెట్టే ఖర్చు అత్యధికంగా 55శాతం ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖర్చులు పెరిగినంత మాత్రాన జీడీపీ వృద్ధి ఏకపక్షంగా పెరిగిపోతుందని చెప్పలేం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వ వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన మూడు అంశాల భాగస్వామ్యం అత్యల్పంగా ఉంది. అదే సమయంలో మిగిలిన వ్యయాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి తోడు కరోనావైరస్‌ అడ్డూఅదుపు లేకుండా వ్యాపిస్తుండటంతో ఎగమతులు పడిపోయాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో ప్రైవేటు పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ప్రభుత్వ ఖర్చులను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యవస్థలో నగదు ప్రవాహం పెంచడానికి అనుకూలంగా ఉన్నా.. చేతిలో ఆ స్థాయిలో నగదు లభ్యత లేదు.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు జనవరి 18వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 1శాతం వరకు పెరిగాయి. కొన్ని రకాల మోడళ్ల ధరలను దాదాపు రూ.34 వేల(దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో) వరకు పెంచామని సంస్థ వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు పెరగటమే దీనికి కారణమని వెల్లడించింది.

* బుల్‌ రంకేసింది.. ఉత్సాహంతో పరుగులు తీసింది. ఫలితంగా దలాల్‌స్ట్రీట్‌ కళకళలాడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, దిగ్గజ షేర్లలో కొనుగోళ్లతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 800 పాయింట్లకు పైగా ఎగబాకి మళ్లీ 49వేల మార్క్‌ దాటగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 14,400 మార్క్‌ దాటింది.

* ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ సారి ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 5 నుంచి 10శాతం వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు జాబితాలో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు వంటి దాదాపు 50 రకాల వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీటిపై చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

* ఎంపిక‌చేసిన కొంత మంది వినియోగ‌దారుల‌కు ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ మీద న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ వ‌డ్డీ రేట్ల‌ను 9%కు ఇవ్వాల‌ని యోచిస్తోంది.క్రెడిట్ కార్డుల నుండి న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌పై అధిక వ‌డ్డీల‌ను వ‌సూలు చేసే విష‌యంపై దూరంగా ఉండాల‌ని ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ భావిస్తోంది. మంచి క్రెడిట్ రిపోర్ట్ ఉన్న క‌స్ట‌మ‌ర్లకు ఇప్ప‌టినుండి కార్డు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై త‌క్కువ వ‌డ్డీ రేటు చెల్లించే అవ‌కాశ‌ముంద‌ని భావించ‌వ‌చ్చు.ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ త‌న క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. వినియోగ‌దారుల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 9% కంటే త‌క్కువ వ‌సూలు చేయాల‌ని యోచిస్తోంది. అయితే క‌స్ట‌మ‌ర్ యొక్క క్రెడిట్ ప్రోఫైల్‌ను బ‌ట్టి, వార్షిక శాత వ‌డ్డీ రేటు మారుతుంది. 36% వ‌ర‌కు కూడా ఉంటుంది.క్రెడిట్ కార్డ్ మార్కెట్లో ఆల‌స్యంగా ప్ర‌వేశించినందున ఇత‌రుల‌కు భిన్నంగా డైన‌మిక్ వ‌డ్డీ రేట్ల‌తో సంక్లిష్ట‌మైన స్కోరింగ్ విధానాన్ని బ్యాంక్ అభివృద్ధి చేసింది. క‌స్ట‌మ‌ర్ ప్రొఫైల్స్‌ను అంచ‌నా వేయ‌డానికి, స్కోర్‌ల ఆధారంగా వ‌డ్డీ రేట్ల‌ను అందించ‌డానికి బ్యాంక్ యాజ‌మాన్య స్కోరింగ్ విధానాన్ని రూపొందించింది. క‌స్ట‌మ‌ర్ల స్కోర్‌ల‌ను బ‌ట్టి వ‌డ్డీ రేటు నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌ని బ్యాంక్ ప్ర‌తినిధి తెలిపారు.బ్యాంక్ మొద‌ట త‌న వినియోగ‌దారుల‌కు క్రెడిట్ కార్డుల‌ను అందిస్తుంది. ఈ ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో ఇప్ప‌టికే ఉన్న బ్యాంక్ వినియోగ‌దారుల నుండి ధ‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది. ప్ర‌స్తుత బ్యాంక్ వినియోగ‌దారులు కానివారు ఏప్రిల్ నుండి ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.