Movies

కౌగిలితో కాజల్ రోజు మొదలు

‘ప్రాణస్నేహితుడు భర్తగా తన జీవితంలోకి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది కాజల్‌ అగర్వాల్‌. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా గౌతమ్‌ కిచ్లూతో ఏర్పడిన పరిచయం వైవాహిక బంధంతో సాఫల్యంకావడం తన జీవితంలో అపూర్వఘట్టమని ఆనందం వ్యక్తం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో చిరకాల ప్రియుడు గౌతమ్‌ కిచ్లూను కాజల్‌ వివాహమాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందీ జంట. పెళ్లి తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిన కాజల్‌ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. వివాహానంతరం బాధ్యతలు పెరిగాయని, భర్తే జీవన సర్వస్వమైపోయారని చెప్పింది. మాల్దీవుల్లో జరిగిన హనీమూన్‌ను ఆసాంతం ఎంజాయ్‌ చేశామంది. సినిమాల్ని ఫస్ట్‌లవ్‌గా ఫీలవుతానని..చిత్రసీమకు ఎప్పటికీ దూరం కానని స్పష్టం చేసింది. కెమెరా ముందు ఉంటే ధ్యానం చేసిన ఆనందానుభూతికి లోనవుతానని కాజల్‌ పేర్కొంది. ‘జీవితంలోని ప్రతి క్షణాన్ని సానుకూల దృక్పథంతో ఆనందంగా గడపటానికి ఇష్టపడతాను. రోజువారి దినచర్యను గౌతమ్‌ అందించే ప్రేమపూర్వక కౌగిలింతతో ఆరంభిస్తాను. ఆ తర్వాత మహామంత్ర జపించి, ముప్పై నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌ చేస్తాను’ అని కాజల్‌ వివరించింది. చిన్నతనంలో ఆస్ట్రోనాట్‌ కావాలని కలలు కన్నానని..అనుకోకుండా సినిమాలవైపు వచ్చానని తెలిపింది. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తన వ్యక్తిత్వంలోనే లేవని కాజల్‌ పేర్కొంది.