Fashion

అమృతరథాన్ని నడిపే అమ్మకు వందనం

Rajini Amrutha Ratham In Guntur - Telugu OffBeat News

పిడికెడు పొట్ట నింపుకోవడానికి… పట్టెడన్నం చాలు. కానీ దానికోసమే రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్లు మాత్రం ఎందరో. అలా తమ దుకాణంలో ఆకలితో పనిచేస్తోన్న పనివారికి రోజూ భోజనం పెట్టాలనుకుందో మహిళ. ఆ సంకల్పమే ఇంతింతై… ‘అమృతమయి ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారాఇప్పుడు నిత్యం వేలాది మంది కడుపు నింపుతోంది. ఆ మహిళే గుంటూరుకి చెందిన కొప్పురావూరి రజని.
రెండొందల మందికి అంచనా వేసుకుని గుంటూరు నగరంలో పుట్టినరోజు వేడుక నిర్వహించిందో కుటుంబం. కానీ భారీ వర్షం కారణంగా వందమంది మాత్రమే హాజరయ్యారు. దాంతో వండిన పదార్ధాలన్నీ మిగిలిపోయాయి. ఆ విషయం తెలుసుకున్న అమృతమయి వాహనం అక్కడికి చేరుకుంది. వాటిని సేకరించి నేరుగా రైల్వేస్టేషన్‌ కూడలికి వెళ్లి నిలిపింది. అంతే ఆకలితో ఉన్నవారంతా లైను కట్టారు. నిమిషాల్లోనే భోజనం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణే కావొచ్చు కానీ…ఫలానా హోటల్లో, ఫంక్షన్‌లో ఎక్కడ ఆహారం ఉందని చెప్పినా ఇంతే చేస్తారు. ఆ పదార్థాలతో ఆకలిగా ఉన్నవారి కడుపు నింపుతారు రజని. ఈ ఆలోచన వెనక ఓ పెద్ద కథే ఉంది అంటారామె. ‘ముప్పై ఏళ్ల క్రితం గుంటూరులో ఓ దుస్తుల దుకాణం ప్రారంభించాం. షాపులో పనిచేసేవారు ఎప్పుడో పొద్దున్న తెచ్చుకున్న ఆహారం మధ్యాహ్నానికి పాడైపోయి తినలేని పరిస్థితి ఉండేది. అలాగని చేతిలో ఉన్న కొద్ది డబ్బులూ ఖర్చుచేసి బయట తినలేక అలానే ఉపవాసం ఉండేవారు. ఓ సారి ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో మా దగ్గర పనిచేసే అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో వాళ్లకి నా ఆలోచన చెప్పడంతో ప్రోత్సహించారు. అలా మొదలయ్యింది ఈ కార్యక్రమం. ఈ పని మా ఇంటిల్లిపాదికీ సంతోషం కలిగించేది. తర్వాత మరో అడుగు ముందుకేశా. తర్వాత రోజు నుంచి గుంటూరు ఫీవర్‌ ఆసుపత్రిలో రోజూ నూటయాభైమందికి అన్నం వండి పెట్టడం మొదలుపెట్టా’ అంటారు రజని. ఆహారం వృథా కానివ్వకుండా… కుటుంబ సభ్యుల పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాలను కూడా అన్నదానం చేయడానికి ఉపయోగించుకున్నారు రజని. ‘ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా…సరే మా ఇంటి నుంచి అనాథ శరణాలయాలు, వసతిగృహాలు, రోడ్డు పక్కన ఉండేవారికి భోజనం పెట్టడాన్ని ఆనవాయితీగా చేసుకున్నాం. కానీ ఆకలితో ఇంకా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందుకే అందరి సహకారమూ తీసుకోవాలనుకున్నా. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథాకానివ్వకుండా నిస్సహాయులకు పంచితే… అనే ఆలోచన వచ్చింది. కానీ ఇది అనుకున్నంత సులువేం కాదు..ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్లే అందుకే ప్రత్యేక నిబంధనలు ఏర్పరుచుకున్నాం. జాగ్రత్తలూ తీసుకుంటాం. ఇందుకోసం సుమారు పదిలక్షల రూపాయలు వెచ్చించి ఆహార రవాణాకు ఓ వాహనం, డ్రైవరు, కొంత సామగ్రి ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఆహారం ఎక్కువగా ఉన్నా మాకు ఫోన్‌ చేయండి అంటూ కరపత్రాలు పంచాం. కల్యాణ మండపాలు, ఫంక్షనుహాలులో పోస్టర్లు వేశాం’ అంటారు రజని. మూడులక్షల మందికి పైగా… రజని ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. క్యాటరింగ్‌ నిర్వాహకులు, కల్యాణ మండపాల వారు సమాచారం ఇస్తున్నారు. అలా ఆహారాన్ని సేకరించి ఇప్పటివరకూ సుమారు మూడులక్షలమందికి పైగా భోజనం అందించింది ఆమె సంస్థ. నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర సొమ్ము వెచ్చిస్తున్నారు. ‘అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడా అన్నం దొరక్కపోయినా మా వాహనాల్లో ఉంటుంది. నగరంతోపాటు పరిసర ప్రాంతాలైన సత్తెనపల్లి, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనూ మా వాహనం సేవలు అందిస్తోంది. ఇప్పటివరకూ సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఫ్రీజర్లు ఏర్పాటుచేసి ఆహారం నిల్వచేసే ఆలోచన ఉంది’ అంటున్నారు రజని.