Business

100మిలియన్ల నజరానా ప్రకటించిన మస్క్-వాణిజ్యం

100మిలియన్ల నజరానా ప్రకటించిన మస్క్-వాణిజ్యం

* ఇటీవలే ప్రపంచంలోనే అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్ కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే యజ్ఞంలో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. అటువంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నవారిని ప్రోత్సహించేందుకు ఆయన భారీ నజరానా కూడా ప్రకటించారు. తద్వారా పోటీ పెంచి వీలైనంత త్వరగా మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.730 కోట్లు) బహుమానంగా ఇస్తానని ట్విటర్‌లో ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వచ్చే వారం వెల్లడిస్తానని తెలిపారు.

* బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో 8.5 శాతం ఎన్‌పీఏలు ఉన్నట్లు అంచనా. మార్చి నాటికి ఇవి 12.5 శాతానికి… పరిస్థితులు దిగజారితే 14.7 శాతానికీ చేరొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్‌ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్‌ బ్యాంక్‌.

* కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇంటి నుంచి ప‌నిచేయ‌డం ఇప్పుడు సాధార‌ణ విష‌యంగా మార‌డంతో ఇంటి కొనుగోలుదారులు ఇప్పుడు పెద్ద అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు.ఏడు పెద్ద‌ నగరాల్లో సగటు అపార్ట్‌మెంట్ పరిమాణం నాలుగేళ్లలో మొదటిసారిగా పెరిగిందని అనారోక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ గణాంకాల ప్రకారం తెలిసింది.ఒక అపార్ట్‌మెంట్‌ సగటు పరిమాణం 2020 లో 1,150 చదరపు అడుగులు కాగా, 2019 లో ఇది 1,050 చదరపు అడుగుల వద్ద ఉంది. ఏడు నగరాల్లో అపార్ట్‌మెంట్ పరిమాణాలలో సగటున 10 శాతం పెరుగుదల కనిపించింది.2016 నుంచి, సగటు అపార్ట్‌మెంట్ పరిమాణాలను డెవ‌ల‌ప‌ర్లు సంవత్సరానికి కొంత త‌గ్గించారు. 2017 సంవత్సరంలో గరిష్టంగా ఈ ప‌రిమాణాల్లో త‌గ్గుద‌ల న‌మోదైంది. అపార్ట్‌మెంట్ పరిమాణాలు 2016 లో సగటున 1,440 చదరపు అడుగుల‌ నుంచి 2017 లో 1,260 చదరపు అడుగులకు 13 శాతం పడిపోయింది.

* దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం(జనవరి 22) ఉదయం లీటర్ పెట్రోల్ ధర 85.45కి చేరింది. నిన్న ఈ ధర రూ.85.20గా ఉంది. మరోవైపు, లీటర్ డీజిల్ రూ. 75.63 పలికింది. పెట్రోల్‌, డీజిల్ ధరలపై చమురు సంస్థలు 25 పైసలు పెంచడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పెంపుతో ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ.92.04కి చేరుకుంది.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం బలహీనంగా ప్రారంభమైన సూచీలు.. అంతకంతకూ దిగజారాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్‌ 674 పాయింట్లు దిగజారి 48,950 వద్ద, నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 14,395 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతో గురువారం సెన్సెక్స్‌ తొలిసారిగా 50వేల మార్క్‌ను తాకిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు.. నేడు కూడా అదే బాట పట్టాయి.

* బుల్‌ దూకుడుకు భల్లూకం అడ్డుపడింది. అమ్మకాల ఒత్తిడికి మార్కెట్‌ కుదేలైంది. ఫలితంగా ఈ వారాన్ని సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ దాదాపు 750 పాయింట్లు పతనమవ్వగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 14,400 మార్క్‌ను కోల్పోయింది.