Politics

ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఏపీ పంచాయతీ సమరం-తాజావార్తలు

ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఏపీ పంచాయతీ సమరం-తాజావార్తలు

* పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టు తీర్పునకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం తరఫు నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌ఈసీకి సహకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

* ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 27,717 శాంపిల్స్‌ పరీక్షించగా 56 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 141 మంది కోలుకోగా.. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 1,29,03,830 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,87,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,78,528 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7149మంది మృతిచెందారు. ప్రస్తుతం 1389 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం తమదే విజయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకూడదనేదే తమ అభిప్రాయమన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికలంటే భయం లేదని.. ఎవరో వచ్చి తమ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఎవరేం చేసినా అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని చెప్పారు.

* దిల్లీ పోలీసులకు మంగళవారం ఓ పెద్ద సవాల్‌గా మారింది. ఓ వైపు రిపబ్లిక్‌ డే వేడుకలు.. మరోవైపు, రైతు సంఘాలు తలపెట్టిన భారీ ట్రాక్టర్‌ పరేడ్‌.. దీంతో దేశ రాజధానిలో ఎటు చూసినా పోలీసులే..! ఈ రెండు ఈవెంట్లు ఒక్కరోజే ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌ వద్ద మంగళవారం జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల కోసం 6వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వింటేజ్‌ పాయింట్లలో ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే, రాజ్‌ఘాట్‌ వద్ద చురుకైన సిబ్బందిని పీపీఈ కిట్లు, మాస్క్‌, ఫేష్‌ షీల్డ్‌లతో మోహరిస్తున్నామని తెలిపారు. రాజ్‌పథ్‌ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కి.మీల మార్గంలో నిఘా ఉంచేందుకు వీలుగా ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లు, స్నీపర్స్‌ గస్తీ కాస్తారన్నారు. దిల్లీ చుట్టూ సరిహద్దు ప్రాంతాల వద్ద ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

* పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు కనువిప్పు కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సజావుగా పనిచేయనీయకుండా వైకాపా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని.. అలాంటి ప్రతి సందర్భంలోనూ కోర్టులో జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయమని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

* ఏపీలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది. గత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2, మూడో దశకు 6, నాలుగో దశకు 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

* దేశంలో సిమెంట్‌, స్టీల్‌ ధరలు తగ్గాలంటే వాటికి ప్రత్యామ్నాయాలు అవసరమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వాటి ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని యువతకు సూచించారు. ఈ మేరకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ విజ్ఞాన్‌ గ్రామ్‌ సంకుల్‌ పరియోజన పథకం కింద తయారైన ఉత్పత్తుల ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

* పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైకాపా ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎన్నికలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందున ప్రభుత్వం తరఫున అనుసరించాల్సిన వైఖరి, కోర్టు చెప్పిన అభిప్రాయాల తీరుపై చర్చించారు. ఎస్‌ఈసీకి సహకరించే అంశంపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తదితరులు హాజరయ్యారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తామన్న సీఎం ప్రకటనను జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.25వేలలోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారని.. మిగిలిన వాటి సంగతేంటని అని ప్రశ్నించారు. రైతుబంధు పేరుతో రైతులకు అందే ప్రయోజనాలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.