Politics

చంద్రకళ….గిరిజనుల జీవకళ!

చంద్రకళ….గిరిజనుల జీవకళ!

ఆమె ఓ ఉద్యోగి. సాధారణంగా ఆ ప్రాంతానికి వచ్చినవారెవరైనా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. దట్టమైన ఆ అటవీప్రాంతంలో సామగ్రిని అందించకపోయినా అడిగేవాళ్లుండరు. కానీ ఆ ఆరోగ్యకార్యకర్తకు అక్కడి బిడ్డల ఆకలి తెలుసు. బాలింతల బాధలూ తెలుసు. బాహ్యప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉండే ఆ ప్రాంతంలోని పాతిక గడపలకూ పౌష్టికాహారాన్ని అందించడం కోసమే రోజూ ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. అదీ 20 కిలోల బరువును నెత్తిన మోస్తూ…మండు టెండల్ని, ఎముకలు కొరికే చలిని, కుండపోతగా కురిసేవాననీ లెక్క చేయకుండా వెళ్లి విధులు నిర్వర్తిస్తోంది. అందుకే ఆమె అంకితభావాన్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త అవార్డుకి ఎంపిక చేసింది. త్వరలో ఈ గౌరవాన్ని ప్రధాని చేతుల మీదుగా అందుకోబోతోంది ఇరవై తొమ్మిదేళ్ల చంద్రకళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కలవల నాగారం ప్రాంతం చంద్రకళది. భర్త సాంబశివరావు. వారికి నలుగురు పిల్లలు. గత ఎనిమిదేళ్లుగా పినపాక మండలం టేకులగూడెంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. అయితే ఆమె వరంగల్‌ జిల్లాలో పుట్టింది. నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయింది. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్లులేక తనెంత తల్లడిల్లేదో ఇప్పటికీ తనకు గుర్తే అని బాధపడుతుంది. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు కూడా తనలాంటివారికి పోషకాహారాన్ని మోసుకెళ్లి మరీ అందించేదీమె. ‘నలుగురు పిల్లల తల్లిని నేను…పిల్లల ఆకలి నాకు తెలుసు, అందుకే ఎంత దూరమైనా, కష్టమైనా వారూ నా పిల్లలే అనుకుని వెళ్లొస్తా. నా చిన్నప్పుడు ఎవరైనా పిలిచి పట్టెడన్నం పెడతారేమోనని ఎదురు చూసేదాన్ని. తర్వాత బంధువుల ఇంట్లో, హాస్టల్‌లో పెరిగా’ అని గతం గుర్తుచేసుకుంటుంది చంద్రకళ.

వాగుల మధ్య… ఉదయం ఎనిమిది గంటలకే చంద్రకళ పని మొదలవుతుంది. తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది. ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కార్యాలయం. ఇక్కడే గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని వండి సిద్ధం చేయాలి. తర్వాత రెండుకిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతంలోని 25 కుటుంబాలకు ప్రభుత్వం అందించే సరకుల్ని, ఆహారాన్ని అందివ్వాలి. ఆ ప్రాంతమంతా ఎత్తైన గుట్టలు, వాగుల మధ్య ఉండటంతో ప్రభుత్వ వాహనం లోపలికి రాలేదు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసే ఈ ఆహారపదార్థాలన్నింటినీ ప్రతి నెల గ్రామానికి బయటే సేకరిస్తుంది చంద్రకళ. వాటిని అక్కడే ఓ ఇంటిలో భద్రపరుస్తుంది. వీటిని భాగాలుగా విడదీసి ఒక్కొక్క రోజు ఒక్కో ఇంటికి అందించాల్సిన పదార్థాలను మోసుకెళుతుంది. పప్పు, బియ్యం, నూనె, గుడ్లు, బాలామృతం, పాలు వంటివి దాదాపు 20 నుంచి 30 కేజీల బరువుంటాయి. అలా ఆ బరువుని రెండు కిలోమీటర్లు మోయాల్సి ఉంటుంది. మధ్యలో రెండు వాగులు ఉంటాయి. కాస్త చినుకుపడితే చాలు…ఉధృతంగా ప్రవహిస్తాయి. లేకున్నా వాటిని దాటాల్సిందే. ఎత్తైన గుట్టలు ఎక్కి దిగుతూ నడవాల్సి ఉంటుంది. ‘ఇదంతా కష్టమే. అయితే నా కోసం ఎదురుచూసేవారిని గుర్తు పెట్టుకుంటా. ఊళ్లో అందరూ నిరుపేదలే. పశువులు కాస్తారు. కూలీలకు వెళతారు. ఈ కరోనా వల్ల పనుల్లేవు. దాంతో గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. దీంతో కొవిడ్‌ సమయంలో నా పని రెట్టింపు అయ్యింది. గుడ్లను మిగతా సామానుతోపాటు పంపిణీ చేయడం కొంత కష్టమైన పనే అయినా ఇష్టంగా చేస్తా. ఈ అవార్డుతో ప్రధానిని కలిసే అవకాశం దక్కింది. ఇప్పటివరకూ నేను కనీసం రైలు ఎక్కలేదు. ఇప్పుడు విమానంలో దిల్లీ వెళ్లబోతున్నా. కలా నిజమా అనిపిస్తోంది. ఇది నా బాధ్యతను మరింత పెంచిందనే అనుకుంటున్నా’ అని చెబుతోంది చంద్రకళ.