Agriculture

గంధం సాగులో రైతు ప్రతిభ

గంధం సాగులో రైతు ప్రతిభ

శ్రీగంధం సాగులో విజయరాయి రైతు విజయగాథ

రైతులకు అద్భుతమైన ఆదాయాన్ని అందించే వృక్షరాజంగా ఆదరణ పొందుతోంది శ్రీగంధం. గంధం దిగుబడినిబట్టి ఒక్కో చెట్టు 2 లక్షల నుండి 8 లక్షల రూపాయల ధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. అంతర్ఝాతీయంగా వన్నె తరగని డిమాండ్ వున్న ఈ కలపజాతి వృక్షాన్ని, తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్థుతం కిలో శ్రీగంధం, మార్కెట్లో 25 వేల నుండి 40 వేలు పలుకుతోంది. అంతర్ఝాతీయంగా శ్రీగంధం కొరత దృష్ట్యా రాబోయే 20 సం.లలో మార్కెట్ విలువ 10 రెట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో 8 దేశాలు మాత్రమే శ్రీగంధం సాగుకు అనుకూలం. అందులో భారత దేశంలో పండే కలప నాణ్యత, సువాసన అధికం. ప్రస్థుతం దేశీయ అవసరాలకు సరిపోయే శ్రీగంధం లభ్యత లేకపోవటంతో ప్రభుత్వం, శ్రీగంధం ఎగుమతులను పరిమితం చేసింది. శ్రీగంధం సాగును ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2002 నుండి ఔషధ సుగంధ మొక్కల బోర్డు ద్వారా వ్యవసాయ భూముల్లో సైతం సాగుకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కలపవృక్షం సాగు కొత్త పుంతలు తొక్కుతోంది. మొక్కల మధ్య ఎటుచూసినా 10 అడుగుల ఎడంతో ఎకరాకు 450 శ్రీగంధం మొక్కులు నాటుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్, చీనీ నిమ్మ, సపోటా తోటల్లో అంతరపంటగా శ్రీగంధం నాటవచ్చు.

శ్రీగంధం పరాన్నభుక్కు మొక్క. ఇతర మొక్కల వేర్ల నుండి కొంతమేర పోషకాలను సంగ్రహించి పెరుగుతుంది. అందువల్ల ఇతర పంటల్లో అంతరపంటగా సాగుచేస్తే వేగంగా పెరుగుతుంది. నాటిన 15 నుండి 25 సంవత్సరాల మధ్య ఎకరాకు 4 -8 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు నొక్కివక్కాణిస్తున్నారు. 24 సంవత్సరాల క్రితం 1.5 ఎకరాల భూమిలో శ్రీగంధం సాగు మొదలుపెట్టి కోటీశ్వరుడయ్యాడు రైతు మట్టా వెంకటేశ్వర రావు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, విజయరాయి గ్రామానికి చెందిన ఈయన పొలంలో ప్రస్థుతం 300వరకు శ్రీగంధం మొక్కలు వున్నాయి. 24 సం.ల వయసున్న 50 చెట్లను గత ఫిబ్రవరిలో బేరం పెట్టగా చెన్నైకి చెందిన వ్యాపారులు 1 కోటి 10 లక్షలకు బేరసారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్థుత మార్కెట్ విలువ ప్రకారం తన ఎకరంనర పొలంలోని మొత్తం చెట్ల విలువ 4 నుండి 6 కోట్లు వుంటుందని రైతు చెబుతున్నారు.