Politics

పోలవరంపై జగన్ ప్రత్యేక దృష్టి-తాజావార్తలు

News Roundup - YS Jagan Orders Timely Completion Of Polavaram

* పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాల్సిందేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. తొలివిడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని ఆదేశించారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని.. సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత ప్రణాళిక మేరకు ఆర్అండ్‌ఆర్‌ పనులను చేపట్టాలని చెప్పారు.

* ఒడుదొడుకులకు గురైన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు భారత విదేశాంగ మంత్రి చేసిన సూచనలను తాము పరిగణనలోకి తీసుకున్నామని శుక్రవారం చైనా వెల్లడించింది. అలాగే బీజింగ్‌తో సంబంధాలకు దిల్లీ ప్రాముఖ్యతనిచ్చిందని, ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నామని తెలిపింది. గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రసంగం గురించి ప్రశ్నించగా..చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియన్ ఈ విధంగా స్పందించారు. ‘ఆయన భారత్, చైనా సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనాతో సంబంధాలకు భారత్‌ ప్రాముఖ్యతనిస్తుందని ఈ వైఖరి వెల్లడిచేస్తుంది. దాన్ని మేం అభినందిస్తున్నాం. సరిహద్దు సమస్య పూర్తిగా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపడి ఉండకూడదని మేం చెప్పాం’ అని ఝావో సమాధానమిచ్చారు.

* గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. బీఫ్‌ ఫెస్టివల్‌ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల క్రితం తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్‌ యత్నించారు. ఈ క్రమంలో పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారనే అభియోగాలపై రాజాసింగ్‌పై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. గురువారం వారణాసి చేరుకున్న వీరంతా పలు దేవాలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుందిరాజ్‌ ఆలయంలో గణేశుడికి ప్రత్యేక పూజల అనంతరం వారాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు.

* కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది. రీజినల్‌ కనెక్టివిటీ పథకం (ఉడాన్‌) లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పీటీఐ వెల్లడించింది. ‘‘దక్షిణ భారతదేశంలో రీజినల్‌ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని మేం భావిస్తున్నాం’’ అని ఇండిగో ప్రధాన స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్‌కుమార్ తెలిపారు.

* ‘తీవ్రమైన సంక్షోభం తీసుకొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు’ అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి అంచున ఉన్న బ్రిటన్‌ను ఆయన విజేతగా నిలిపారు. ఇప్పుడు చర్చిల్‌ మాటలను భారత పాలకులు జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. చైనాతో ఘర్షణ అంటే సామాన్యంగా ఉండదు.. 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక మత్తేభం.. డ్రాగన్‌ రక్షణ రంగ బడ్జెట్‌ 179 బిలియన్‌ డాలర్లు.. దాని ఆయుధాలు అత్యధిక భాగం దేశీయంగా తయారవుతాయి. అంటే కారుచౌకగా ఆయుధ సరఫరా కొనసాగుతుందన్నమాట.. భారత్‌ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.. చైనాతో పోల్చుకుంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఐదింట ఒకటో వంతు ఉంటుంది.

* పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో నిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కర్నూలులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ భిన్నాభిప్రాయాలతో బాగుపడుతుందని చెప్పారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలన్నారు. అలాంటప్పుడే మంచి నాయకత్వం, సామాజిక దృక్పథం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బలవంతపు ఏకగ్రీవాలపై విధిగా షాడో బృందాలు ఏర్పాటు.. అవసరమైతే గృహనిర్బంధాలు చేయాలని జిల్లా అధికారులకు సూచించినట్లు ఎస్‌ఈసీ తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మించి అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. గదులు సరిపోనిచోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామని తెలిపారు.

* పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాల్సిందేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. తొలివిడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని ఆదేశించారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని.. సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత ప్రణాళిక మేరకు ఆర్అండ్‌ఆర్‌ పనులను చేపట్టాలని చెప్పారు.

* కేంద్ర బడ్జెట్‌ ఏటా మార్పులు సంతరించుకుంటూ వస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ మార్పులు సహజమైపోయాయి. అప్పటి వరకు ఫిబ్రవరి నెల చివరి రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సంస్కృతి 2017లో తొలిసారి మారింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. అదే ఏడాది రైల్వే బడ్జెట్‌ సైతం విలీనం అయ్యింది. మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక సూట్‌ కేస్‌ సంస్కృతికి చరమగీతం పాడుతూ వస్త్రంతో కూడిన బ్యాగులో ప్రతులను తీసుకొచ్చి 2019లో తొలిసారి కొత్త పంథాను అనుసరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

* అగ్రరాజ్యంలో భారతీయలు అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఆదాయం విషయంలోనూ ఇతర వర్గాలకన్నా మన వాళ్లు ముందున్నారు. తాజాగా వెల్లడైన ఓ సర్వే ప్రకారం.. అమెరికాలో భారత అమెరికన్‌ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 1,20,000 డాలర్లట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.87లక్షలు పైనే. అమెరికన్లు సహా ఇతర వర్గాల సగటు ఆదాయం కంటే ఇదే ఎక్కువ కావడం విశేషం. అగ్రరాజ్యంలో వార్షిక ఆదాయాలపై నేషనల్‌ కొయలిషన్‌ ఫర్‌ ఏషియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది.

* టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’‌. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. జులై 16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

* వాట్సాప్‌ కొత్త గోప్యతా విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యూజర్స్‌ని ఆకట్టుకుని వాట్సాప్‌ తరహా అనుభూతిని అందించేందుకు టెలిగ్రాం, సిగ్నల్ యాప్‌లు ఇప్పటికే పలు రకాల కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేశాయి. కొద్దిరోజుల క్రితం సిగ్నల్ యాప్‌ కస్టమ్‌ వాల్‌పేపర్స్‌, యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని తీసుకొచ్చింది. తాజాగా టెలిగ్రాం ఒకడుగు ముందుకేసి వాట్సాప్‌ నుంచి టెలిగ్రాంకు ఛాట్ హిస్టరీని మార్చుకునేలా కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

* అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 30న దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇది కొన్ని కార్యాలయాలకే పరిమితమవుతూ వస్తోందని, సాధారణ ప్రజలు రోజువారీ పనుల్లో నిమగ్నమవుతూ దీన్ని విస్మరిస్తున్నారని హోంశాఖ అభిప్రాయపడింది.