Sports

ఇంటికి వచ్చే ఆనందంలో గెలిచిన సింధు

ఇంటికి వచ్చే ఆనందంలో గెలిచిన సింధు

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీని పీవీ సింధు విజయంతో ముగించగా.. కిదాంబి శ్రీకాంత్‌ మాత్రం హ్యాట్రిక్‌ ఓటమి నమోదు చేశాడు. అంతకుముందే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి ప్లేయర్లు సెమీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. శుక్రవారం నామమాత్రమైన తన మూడో మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ సింధు 21-18, 21-15 తేడాతో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌)పై ఓదార్పు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలి గేమ్‌లో ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఆమె 9-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ తిరిగి పుంజుకున్న ప్రత్యర్థి ఓ దశలో 16-15తో ఆధిపత్యం ప్రదర్శించింది. సింధు ప్రతిఘటించి 16-16తో స్కోరు సమం చేసింది. అదే జోరు కొనసాగించిన తను చివర్లో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో రెట్టించిన ఉత్సాహంతో ఆడిన ఆమె ఆరంభంలోనే 6-0తో ఆధిక్యం సాధించింది. అదే దూకుడు కొనసాగించి ప్రత్యర్థిని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-12, 18-21, 19-21తో లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన స్థానంలో ఉన్న ప్రత్యర్థిపై మంచి ఆటతీరుతో తొలి గేమ్‌ సొంతం చేసుకున్న శ్రీకాంత్‌.. ఆ తర్వాత వెనకబడ్డాడు. రెండో గేమ్‌లోనూ ఓ దశలో 13-10తో ఆధిక్యం సాధించినప్పటికీ.. ప్రత్యర్థి పుంజుకోవడంతో ఓటమి తప్పలేదు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పోరు హోరాహోరీగా సాగింది. 19-19తో స్కోరు సమమైన దశలో ప్రత్యర్థి వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ చేజిక్కించుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో తనకు మంచి ముగింపే లభించిందని సింధు తెలిపింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెలలో యొనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఆడిన ఆమె.. తొలి రౌండ్లోనే ఓడిన సంగతి తెలిసిందే. టయొటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగింది.