Business

రికార్డు ధర పెరిగిన వెండి-వాణిజ్యం

రికార్డు ధర పెరిగిన వెండి-వాణిజ్యం

* దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. శుక్రవారం వెండి ధర అమాంతం ఎగబాకింది. ఒక్కరోజే దాదాపు రూ.3వేలు పెరగడం గమనార్హం. అటు బంగారం కూడా స్వల్పంగా పెరిగింది. క్రితం సెషన్‌లో రూ.65,495గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ. 2,915 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అటు బంగారం ధర రూ. 132 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ.48,376కు చేరింది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,844.35 డాలర్లు, ఔన్సు వెండి 26.35 డాలర్లుగా ఉంది.

* ప‌్ర‌ముఖ మోటారు సైకిళ్ల త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ శుక్ర‌వారం లాంఛ‌నంగా జ‌పాన్ విప‌ణిలోకి అడుగు పెట్టింది. దేశ రాజ‌ధాని టోక్యో న‌గ‌రంలో తొలి షోరూమ్ ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌తోపాటు దుస్తులు కూడా ల‌భిస్తాయి. బైక్స్ స‌ర్వీస్‌తోపాటు విడి భాగాలు అందుబాటులో ఉంటాయి. బుల్లెట్ 500, క్లాసిక్ 500, హిమాల‌య‌న్‌, ఇంట‌ర్‌సెప్ట‌ర్ 650, కాంటినెంట‌ల్ జీటీ 650 మోడ‌ల్ బైక్‌ల‌తో జ‌పాన్ మార్కెట్‌లోకి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఎంట‌రైంది. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను స్రుష్టించ‌డం కోసం టోక్యోలో షోరూమ్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

* కేంద్ర బడ్జెట్‌ ఏటా మార్పులు సంతరించుకుంటూ వస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ మార్పులు సహజమైపోయాయి. అప్పటి వరకు ఫిబ్రవరి నెల చివరి రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సంస్కృతి 2017లో తొలిసారి మారింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. అదే ఏడాది రైల్వే బడ్జెట్‌ సైతం విలీనం అయ్యింది. మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక సూట్‌ కేస్‌ సంస్కృతికి చరమగీతం పాడుతూ వస్త్రంతో కూడిన బ్యాగులో ప్రతులను తీసుకొచ్చి 2019లో తొలిసారి కొత్త పంథాను అనుసరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌. అలాగే ఈ సారి (2021-22) బడ్జెట్‌లో సైతం కీలకమైన మార్పు చోటుచేసుకుంటోంది. అదే బడ్జెట్‌ పత్రాల ముద్రణ! కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి ముద్రణను నిలిపివేశారు. దీంతో బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌ సభ్యులకు ఎలక్ట్రానిక్‌ రూపంలో సభ్యులందరికీ అందజేయనున్నారు. అలాగే ఈ సారి బడ్జెట్‌ కోసం ప్రత్యేక యాప్‌ను సైతం కేంద్రం తీసుకొచ్చింది.

* ‘ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్‌’ అంటూ గత నెల నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు సామాన్యుడిలో ఆశలు పెంచాయి. ఆదాయపు పన్ను కచ్చితంగా చెల్లించే వేతన జీవులే ఈ వర్గంలో ఎక్కువగా ఉంటారు. వారి ఆశలు కేవలం చిన్న రాయితీలు.. మినహాయింపుల పైనే ఉంటాయి. ఆదాయపు పన్ను, ఆరోగ్య బీమా, గృహ రుణాల చెల్లింపుపై రాయితీ వంటివి మాత్రమే వారికి ఎక్కువగా రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఈ సారి చాలా మంది వేతనాలు తగ్గడం, ఉద్యోగాలు పోవడంతో బడ్జెట్‌లో వచ్చే చిన్న రాయితీ అయినా వారికి కచ్చితంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.