Editorials

మోడీ హయాంలో ఇండియాలో అవినీతి తగ్గిందా? పెరిగిందా?-TNI ప్రత్యేకం

మోడీ హయాంలో ఇండియాలో అవినీతి తగ్గిందా? పెరిగిందా?-TNI ప్రత్యేకం

“నేను తినను ఇతరులను తిననివ్వను” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అన్నారు. గాలి దుమారం మాదిరి ఎవరినీ గుక్క తిప్పుకోనివ్వలేదు. రాజకీయ ప్రత్యర్ధుల నోళ్లు మూతపడ్డాయి. కాలం గడిచిన కొద్దీ ఎవరైనా ప్రశ్నిస్తే కొంత సమయం ఇవ్వండి, ఇన్నాళ్లూ ఆగినవారు అంత తొందరపడతారేం అంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేండ్లు గడిచాయి.రెండవ సారి అధికారానికి వచ్చిన మోడీ గారి ఏలుబడి త్వరలో రెండు (మొత్తం ఏడు ) సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోంది. తాజాగా ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌(టిఐ) సంస్ధ ప్రపంచ దేశాలలో 2020 అవినీతి ర్యాంకులను ప్రకటించింది. దానిప్రకారం మన దేశం 2019లో 80వ స్ధానంలో ఉన్నది కాస్తా ఆరు స్ధానాలు పోగొట్టుకొని 86కు దిగజారింది. ఇలా ఎందుకు జరిగిందో అడిగేవారూ లేరు అడిగినా చెప్పేవారు లేరు. మదనపల్లి జంటహత్యల కేసులో ఉన్మాద నిందితుల మాదిరి మరోలోకంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సూచికలు ఆయా దేశాల్లోని వాస్తవ అవినీతిని ప్రతిబింబించవని, అయితే పరిస్ధితిని వెల్లడిస్తాయన్నది కొందరి అభిప్రాయం. నిజమే, నిజాలను ఏడు నిలువుల్లోతున పూడ్చిపెట్టే స్ధితిలో అది నిజం. ఈ సూచికలను రూపొందించే టిఐ కమ్యూనిస్టులతోనో లేక బిజెపి వ్యతిరేకులో, హిందూత్వ వ్యతిరేకులతోనో నిండిన సంస్ధ కాదు. వందకుపైగా దేశాలలో పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ద. అవినీతిని వ్యతిరేకించటం, దేశాల అవినీతి ర్యాంకులను ప్రకటించటం వంటి కార్యకలాపాలను అది నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌(సిపిఐ)ను ప్రకటిస్తోంది. జనవరి 28న తాజా సూచికలను ప్రకటించింది.కోవిడ్‌-19 అంటే కేవలం ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభమే కాదు, అవినీతి సంక్షోభం కూడా అని నివేదిక ముందుమాటల్లో ఆ సంస్ధ అధ్యక్షురాలు డెలియా ఫెరారియా రుబియో పేర్కొన్నారు. ” మరొకటి ఏమంటే దాన్ని నియంత్రించటంలో మనం విఫలం అవుతున్నాము. గతేడాది ప్రభుత్వాలు పరీక్షకు గురైనట్లుగా మరియు ఉన్నత స్ధాయిలో ఉన్న అవినీతి సవాలును ఎదుర్కొనటంలో అంత తక్కువగా వ్యవహరించిన తీరు మరొకటెన్నడూ మన జ్ఞాపకాల్లో లేదు. అవినీతి తక్కువ సూచికలున్న దేశాలు కూడా ఇంటా బయటా అవినీతిని స్ధిరపరచకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డెలియా పేర్కొన్నారు.

2012కు ముందు సూచికలను ఒక పద్దతిలో రూపొందిస్తే తరువాత దాన్ని మార్చారు. 2012 నుంచి వివిధ దేశాల సూచికలను విశ్లేషించినపుడు 26 దేశాలు తమ స్ధానాలను గణనీయంగా మెరుగుపరచుకున్నాయి. మరో 22 దేశాలు తమ స్ధానాలను దిగజార్చుకున్నాయి. సగం దేశాలలో పరిస్ధితిలో మార్పులేదు. ఈ నేపధ్యంలో మన దేశం ఎక్కడుంది ? దీనికి కారకులు ఎవరు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలా లేదా ? ఏ దేశంలో అయినా అవినీతి పెరిగినా, తరిగినా, మార్పులేకపోయినా దానికి ఆయా దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తప్ప మరొకరిని బాధ్యులుగా చూడలేము.

అవినీతి సూచికలు విడుదల అయిన రోజే కరోనా మహమ్మారి పట్ల వ్యవహరించిన తీరు తెన్నుల మీద లోవీ సంస్ధ 98దేశాల సూచికలను విడుదల చేసింది. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనాను ఎలా ఎదుర్కొన్నదీ వంది మాగధులు ఎలా పొగుడుతున్నదీ చూశాము. అయితే లోవీ సంస్ధ మన దేశానికి 86 ర్యాంకు ఇచ్చింది. అన్నింటి కంటే అవమానకరం ఏమంటే ఇరుగుపొరుగు దేశాల్లో మనకంటే మెరుగ్గా బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 70, పాకిస్ధాన్‌ 69, శ్రీలంక 10వ స్ధానంలో ఉంది. చైనా విడుదల చేసిన సమచారాన్ని నమ్మటం లేదు గనుక ఆ దేశానికి చెందిన సమాచారం లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదని లోవీ సంస్ధ చెప్పింది. వంద మార్కులకు గాను మన దేశానికి వచ్చింది 24.3 మాత్రమే. మొదటి రెండు స్ధానాల్లో ఉన్న న్యూజిలాండ్‌కు 94.4, వియత్నాంకు 90.8, పదవ స్ధానంలోని శ్రీలంకకు 76.8 మార్కులు వచ్చాయి.
లాటిన్‌ అమెరికాలోని ఉరుగ్వే ఆ ఖండంలో మెరుగైన స్ధానంలో ఉంది. ఆరోగ్య సంరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన కారణంగా మహమ్మారులు తలెత్తినపుడు వాటి పర్యవేక్షణకు మెరుగైన వ్యవస్ధను కలిగి ఉంది, ఈ కారణంగానే ఎల్లో ఫీవర్‌, జైకా వైరస్‌ తలెత్తినపుడు వాటి పట్ల ఎంతో సమర్దవంతంగా వ్యవహరించగలిగింది. మరో వైపున బంగ్లాదేశ్‌ విషయానికి వస్తే (కరోనా కట్టడిలో మనకంటే రెండు స్ధానాలు ఎగువ ఉన్నప్పటికీ) ఆరోగ్య సంరక్షణ కేటాయింపులు చాలా తక్కువ, కరోనా సమయంలో అన్ని రకాల అవినీతి వ్యవహారాలు చోటు చేసుకున్నాయని టిఐ పేర్కొన్నది.

మహమ్మారిని ఒక దేశం మొత్తంగా ఎలా ఎదుర్కొన్నదని చూస్తారు తప్ప రాష్ట్రాలవారీ కాదు. మన పెద్దలు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది కనుక మన దేశ ర్యాంకు దిగువ స్ధానంలో ఉండటానికి నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూడకూడదని వాదిస్తారు.