Politics

కోరిక తీర్చుకున్న నిమ్మగడ్డ-తాజావార్తలు

కోరిక తీర్చుకున్న నిమ్మగడ్డ-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41,003 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 129 కేసులు నిర్ధారణ కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,720కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,153కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 147 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,79,278కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,289 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,95,962 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* కడప జిల్లా….ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ మీట్..ఒంటిమిట్ట లో బసచేసి స్వామివారి అభిషేకంలో పాల్గోనాలని వ్యక్తిగత కోరిక..ఆ కోరిక నేరవేరడం అదృష్టంగా భావిస్తున్నా..ఎన్నికల నిర్వహణ అడ్డుకోబోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు…వైఎస్ హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశా..రాజ్ భవన్ ఆశిస్సులతో ఎన్నికల కమిషన్ అయ్యా..దివంగత నేత వైఎస్ లో లౌకిక దృక్పథం ఉండేది..తనపై వైఎస్ ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు..ఇటీవల జరిగిన కోన్ని పరిణామాల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని…భయపడే ప్రసక్తే లేదని స్పష్టం..సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ హక్కు..రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ..వ్యవస్థలను గౌరవించకుండా మా వాళ్లు మీ వాళ్లు అనడం సరికాదు..2006లో 36శాతమే ఏకగ్రీవమయ్యాయి..ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన ఏకగ్రీవాలు.

* ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ తొలగింపు ఆదేశాలు అమలుకాకపోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదనే కారణంతో విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు సూచిస్తూ గతంలో లేఖ రాశారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ఆదేశాలు అమలు కాకపోవడంతో సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమన్నారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తన ఆదేశాలు అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ జరగకుండా చూశానని ప్రవీణ్‌ అంగీకరించారని సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు.

* నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివారుల్లో రెండు నెలలుగా అన్నదాతలు సాగిస్తున్న ఉద్యమం అంతకంతకూ ఉద్ధృతంగా మారుతోంది. శుక్రవారం సింఘు సరిహద్దు వద్ద స్థానికుల పేరుతో కొందరు రైతులపై దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో హస్తిన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

* కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని టీకా దౌత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన చైనా.. చివరకు చతికిలపడుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పొరుగు దేశాలకు సకాలంలో టీకా అందించలేక అపప్రదను మూటగట్టుకుంటోంది. మరోవైపు భారత్‌ ఈ విషయంలో దూసుకుపోతోంది. రుణాల పేరిట పొరుగు దేశాలను తన బుట్టలో వేసుకోవాలన్న చైనా కుట్రలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ దీన్ని ఒక అవకాశంగా మలచుకుంటోంది.

* దేశరాజధానిలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై దిల్లీ పోలీసు కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. దిల్లీ పోలీస్‌ మహాసంఘ్‌ ఆధ్వర్యంలో షహీదీ పార్క్‌ వద్ద శనివారం నిరసన చేపట్టాయి. ఈ ప్రదర్శనలో.. జనవరి 26 ఘటనలో గాయపడిన పోలీసుల కుటుంబాలు, ప్రస్తుత అధికారులు, విశ్రాంత పోలీసులు పాల్గొన్నారు. పోలీసులపై జరిగిన దాడుల్ని వారు ముక్త కంఠంతో ఖండిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.

* అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పిన భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హామీ నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ నేతలు శనివారం ‘రాజీవ్‌ రైతు భరోసా’ దీక్ష చేపట్టారు. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌తో పాటు పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధికారం చేపట్టిన 20 నెలల్లో వలసలు పెరిగాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలంతా పేదల వ్యతిరేకులని ఆయన ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు.

* తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని తెరాస నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఎంపీ నామానాగేశ్వరరావుతో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో 18 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ చట్టాల అంశాన్ని పలు పార్టీల నేతలు లేవనెత్తారు. సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ఎంపీలు మీడియాకు వెల్లడించారు.

* బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ సికింద్రాబాద్‌ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇంకా కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని, జగత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అతని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ఇప్పటికే అరెస్టయిన 15 మంది బెయిల్‌ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.

* పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో సమర్పించాల్సిన కుల ధ్రువీకరణ పత్రాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తాజాగా జారీ చేసిన పత్రాల కోసం పట్టుబట్టకుండా ఇప్పటికే ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

* భద్రాద్రిని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కోరారు. భద్రాచలంలో ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రిని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పువ్వాడ కోరారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు.కుట్ర పూరితంగా 7 మండలాలను ఏపీలో కలిపారని ఆరోపించారు. ఆలయానికి చెందిన 1,800 ఎకరాల భూమిని ఏపీలో కలిపారని విమర్శించారు.

* వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు నిలిపివేసే ప్రతిపాదనకు ఇప్పటికీ కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. ‘కేంద్రం రైతుల సమస్యను పెద్ద మనసుతో పరిశీలిస్తోందని ప్రధాని అఖిల పక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. జనవరి 22న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. తోమర్ జీ మీతో చర్చించడానికి ఫోన్ కాల్ దూరంలో ఉంటారనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి గుర్తు చేశారు’ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.

* దేశంలో మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌కల్లా ‘కొవొవాక్స్‌’ టీకాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్‌’ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది. భారత్‌లో ట్రయల్స్‌ కోసం ఇప్పటికే అనుమతులు కోరాం. కొవొవాక్స్‌ను జూన్‌ కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం.’’ అని అదర్‌ పూనావాలా ట్విటర్‌లో పేర్కొన్నారు.

* ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు నిత్యం వేల భక్తుల రాకపోకలతోపాటు స్వామివారి కైంకర్యాలు, సేవల కోసం కొన్ని కుటుంబాలు తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో గ్రామంగా విస్తరించింది. ప్రస్తుతం పదివేలకు పైగా జనాభా కలిగిన ఇక్కడ 4వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో కొందరు తితిదే ఉద్యోగులుగా, మరికొందరు వ్యాపారులుగా స్థానికంగానే నివాసం ఉంటున్నారు. తిరుమల ప్రత్యేకత దృష్ట్యా ప్రభుత్వం ఈ గ్రామాన్ని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందినా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగవు. పంచాయతీ అభివృద్ధి మొత్తం తితిదే ఆధ్వర్యంలోనే జరుగుతుంది. తితిదే ఈవో గ్రామాభివృద్ధి అధికారిగా వ్యవహరిస్తారు. స్థానికుల ఇబ్బందులను తితిదే ఆధ్వర్యంలోనే పరిష్కరిస్తారు. తిరుమల ఓటర్లు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే ఓటుహక్కును వినియోగించుకుంటారు.