ScienceAndTech

AI అభివృద్ధికి ఇంకొన్ని దశాబ్దాలు పడుతుంది

Sundar Pichai Says AI Is Still On Budding Phase

దేశంలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ప్రారంభ దశలోనే ఉందని.. దాని నిజమైన సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మరో 10–20 ఏళ్ల కాలం పడుతుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భవిష్యత్తులో కరోనా తరహా అంటు వ్యాధులు వైరస్‌లను పరిష్కరించడంలో ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 ఎంత కల్లోలాన్ని సృష్టిస్తోందో అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పనితీరుకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సాంకేతిక పురోగతి పునాదిపై ఆధారపడి టీకాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యాక్సిన్‌ పంపిణీలో కంప్యూటిక్, మిషన్‌ లెర్నింగ్, ఆల్గరిథం వంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడగలవని.. కాకపోతే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వందల సంవత్సరాలలో జరిగిన ప్రపంచ విపత్తు సంఘటన అయిన కోవిడ్‌–19 గురించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ఏఐ కీలకమైందని.. దీనికి ఎన్నో శాస్త్రీయ ఉదాహరణలున్నాయన్నారు. ‘‘ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ విపత్తులను ఒంటరిగా పరిష్కరించలేదు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి గ్లోబల్‌ పారిస్‌ ఒప్పందం ఉన్నట్టుగానే.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌ వంటి సాంకేతికత పరిజ్ఞానాల ద్వారా పెద్ద, దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని’’ పిచాయ్‌ సూచించారు.