NRI-NRT

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “తారలు–రాతలు”

TANA Literary Meet On Movie Stars And Their Literary Service

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ అంతర్జాల సమావేశం “తారలు – రాతలు” అనే అంశంపై నిర్వహించారు. తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వరరావు, డా. పి. భానుమతి, డా. కొంగర జగయ్య, డా. గొల్లపూడి మారుతిరావుల రచనలను తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో ఆసక్తికరంగా చర్చించారు.

తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి ప్రారంభోపన్యాసం చేశారు. సినిమా నటుల రచనలపై సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు.

వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ చర్చ హర్షనీయమన్నారు.

తనికెళ్ళ భరణి తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప”, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం”, “కోక్కరోకో”, “గార్ధ భాండం”, “చలచల్ గుర్రం”, “జంబు ద్వీపం”, “గొయ్యి” మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని, ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’, ‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అలరించారు.

పద్మవిభూషణ్, నటసమ్రాట్,డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి. సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అయన సాహితీ ప్రస్థానాన్ని డా. కె.వి కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు.

డా. పి. భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణి గారితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను – డా. భానుమతి తో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శారదా అశోకవర్ధన్ వివరించారు.

కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా అచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్య తో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్ని రసరాజు పంచుకున్నారు.

డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాల పై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు చక్కగా వివరించారు.

ఆయా నటులతో ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకున్నారు.