Fashion

135కోట్లలో 30కోట్ల మందికి కరోనా

135కోట్లలో 30కోట్ల మందికి కరోనా

135కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటి వరకూ పావువంతు ప్రజలకు (సుమారు 30కోట్లు) కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్‌ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న కేసుల సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రజలకు కరోనా వ్యాపించి ఉండొచ్చని వారు తెలిపారు. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చన్నారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటంతో చాలా మందిలో వైరస్‌ లక్షణాలు బయట పడట్లేదన్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఈ సర్వేను నిర్వహించింది. త్వరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సర్వేకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఓ సర్వేను నిర్వహించగా అందులో 30వేల మంది భాగమయ్యారు. అందులో 15 మంది భారతీయుల్లో ఒకరిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఇది 6:1గా ఉన్నట్లు తేలిందన్నారు. గత వారం రెండు కోట్ల జనాభా ఉన్నదిల్లీలో నిర్వహించిన ఓ సర్వేలో సగంమందికి పైగా ప్రజలకు కరోనా వైరస్‌ వచ్చిందని గుర్తించారు. 60 శాతం ప్రజల్లో తగినంత రోగనిరోధక శక్తి ఉంటేనే వైరస్‌ గొలుసును తెంచగలమని ప్రంపచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 1.08కోట్ల కరోనా కేసులు, 1,54,596 మరణాలు నమోదయ్యాయి. బుధవారం 11,039 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వరకూ 41,38,918 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.