Business

పసిడి ధరలు పడిపోయాయి-వాణిజ్యం

పసిడి ధరలు పడిపోయాయి-వాణిజ్యం

* నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) కింద కొత్త చందాదారులు ఆన్‌లైన్ ఆధార్ ఇ-కెవైసి ప్రక్రియను ఉప‌యోగించుకునేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) అనుమతించింది. ఆన్‌లైన్ కెవైసి నిర్వహించడానికి రెవెన్యూ శాఖ ఇటీవల ఇచ్చిన అనుమతి ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది, ఎందుకంటే ఈ ప్రక్రియ చందాదారులకు ఎన్‌పీఎస్ సుల‌భ‌మైన‌ డిజిటల్ స‌దుపాయాన్ని అందిస్తుంది అని పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది.

* ఈ సారి బడ్జెట్‌ ఎఫెక్ట్‌ స్టాక్‌ మార్కెట్‌పై దీర్ఘకాలం సానుకూల ప్రభావం చూపనుంది. ఈ విషయాన్ని గ్లోబెల్‌ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఈ సంస్థ సవరించి వెలువరించిన అంచనాల ప్రకారం డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 61 వేలకు చేరుకోవచ్చని పేర్కొంది. ‘‘ఈ బడ్జెట్‌లో పెరిగిన మూలధన వ్యయాలతో భారీ వృద్ధి నమోదవుతుంది. ద్రవ్యలోటు సానుకూల ప్రభావం చూపుతుంది. కొత్తగా ఆదాయపు పన్నుల్లో మార్పులు లేకపోవడం, వృద్ధికి ఊతం ఇవ్వడం, ప్రభుత్వ ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించడానికి సరికొత్త విధానంలో ప్రయత్నాలు చేయడం వంటివి ఈక్విటీ మార్కెట్‌ సెంటిమెంట్‌ను స్థిరంగా కొనసాగించేందుకు దోహదం చేస్తున్నాయి ’’ అని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు నోట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ బడ్జెట్‌ను కచ్చితంగా అమలు చేస్తే ఆర్థికవ్యవస్థ బలపడుతుందని.. దీంతోపాటు జీడీపీలో కార్పొరేట్‌ లాభాల వాటా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.

* అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించడంతో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 తగ్గి రూ.47,387 వద్ద ముగిసింది. వెండి సైతం కేజీకి రూ.1,955 తగ్గి రూ.67,605 వద్ద ముగిసింది. డాలరు విలువ బలపడడం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1835 డాలర్లు ఉండగా.. వెండి ఔన్స్‌ ధర 26.78గా ఉంది.

* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. కేవలం అక్కడితో ఆగకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులను వాడుతున్న వారి చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్‌టెల్ సెర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగలించారు.

* వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన చెన్నై రూబీ జువెల్లరీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మరోసారి భారీఎత్తున తనిఖీలు చేపట్టారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం మరోసారి అమీన్ పూర్‌లో షెల్టర్ తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించింది.

* దలాల్‌ స్ట్రీట్‌లో వరుసగా మూడో రోజూ బుల్‌ రంకెలేసింది. కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన ఉత్సాహానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పరిణామాలు తోడవ్వడంతో దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, మెటల్‌ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 50వేల మార్కును అందుకుంది.

* నేడు ప్రీమార్కెట్‌లో సెన్సెక్స్‌ లాభపడి 50,231 పాయింట్లు దాటి సరికొత్త శిఖరాన్ని చేరింది. కాకపోతే సూచీలు మాత్రం లాభనష్టాల మధ్య ఊగిసలాడతున్నాయి. తొలుత సూచీల ట్రేడింగ్‌ నష్టాల్లో ప్రారంభమైనా.. ఆ తర్వాత కోలుకొని లాభాల్లోకి చేరింది. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్‌ 225 పాయింట్ల లాభంతో 50,023 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 14,715 వద్ద ట్రేడవుతున్నాయి. కొటాక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మాసూచీ 2శాతానికి పైగా పెరిగింది. ఆస్ట్రాల్‌ పాలీ టెక్నిక్‌, యూనికామ్‌ ల్యాబ్‌, సోమన్య హోం ఇన్నోవేటివ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఈపీఎల్ ఎల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.