Food

మెనోపాజ్ బిస్కెట్లు తిన్నారా?

మెనోపాజ్ బిస్కెట్లు తిన్నారా?

హెర్బల్‌ ఔషధాలే బిస్కెట్లుగా, కూల్‌డ్రింకులుగా రూపుమారడంతో చాలామంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఇవి జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరికను తీర్చడంతోపాటు మూలికల ఔషధాలుగానూ పనిచేస్తున్నాయి. స్త్రీల నెలసరి సమస్యలు, మెనోపాజ్‌ లాంటి వాటికి ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. చాలావరకు ఇవన్నీ ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. కొన్నయితే, సూపర్‌ మార్కెట్లలో కూడా దొరుకుతున్నాయి.

**పీసీఓఎస్‌ పానీయాలు
గుర్‌గావ్‌కు చెందిన బటర్‌ఫ్లై ఆయుర్వేద ప్రతి నెలా 1800 పెట్టెల బిస్కెట్లు, కుకీస్‌ అమ్ముతున్నది. వీటిలో కొన్ని రక్తంలో గ్లూకోజ్‌ని కంట్రోల్‌ చేస్తాయి. ప్రాణం, తేజస్సు, ఓజస్సులను పెంచుతాయి. మరికొన్ని దోషాలను సమతుల్యం చేస్తాయి. తమ ఉత్పత్తి కన్నా డిమాండ్‌ ఎక్కువగా ఉంటున్నదని చెప్తున్నారు దీన్ని ప్రారంభించిన ఆక్షి ఖండేల్వాల్‌. బెంగళూరుకు చెందిన మెర్హాకి ఫుడ్స్‌ స్త్రీల ఆరోగ్యం కోసం చాక్లెట్లు అమ్ముతున్నది. ఈ చాక్లెట్లు నెలసరి సమస్యలను తగ్గిస్తాయి. మెనోపాజ్‌ ఇబ్బందుల నుంచి బయటపడేసే కుకీస్‌, పీసీఓఎస్‌ జబ్బును తగ్గించే పానీయాలు కూడా ఈ కంపెనీ నుంచే తయారవుతున్నాయి. వన్‌ కేర్‌ నేచురల్స్‌ అనే మరో కంపెనీ ‘మూన్‌ బ్య్రూ’ అనే నిద్రలేమిని తగ్గించే జాజికాయ పానీయాలను తయారుచేస్తున్నది. ఇప్పటివరకు 25 నుంచి 45 మధ్య వయసు వాళ్లలో 5 వేల మందికి పైగా వీటిని ఆర్డర్‌ చేశారట. పింక్‌, గ్రీన్‌ (బీట్‌రూట్‌, ఇలాచీతో తయారుచేసిన) రకాలను కూడా తొందరలో తీసుకువస్తామంటున్నారు ఈ కంపెనీ ఫౌండర్‌ క్రిస్టొఫర్‌. మూన్‌ బ్య్రూలో జాజికాయతోపాటు దాల్చిన చెక్క, పసుపు, అశ్వగంధ కూడా ఉంటాయి. మూన్‌ మిల్క్‌ పేరుతో ఇది విదేశాల్లో పేరు పొందింది.

**చర్మానికి కొబ్బరినీళ్ల ఔషధం
ఆన్‌లైన్‌లో ఇలాంటి హెర్బల్‌ ఫుడ్స్‌ అమ్మే జెనిత్‌ అనే ఓ కంపెనీ కొబ్బరి నీళ్లను నెలకు 2.5 లక్షల బాటిళ్లను అమ్ముతున్నది. ఈ ఒక్కో బాటిల్‌ ధర 50 రూపాయలు. ఈ కంపెనీ ఉత్పత్తులు మానసిక ఉత్తేజం, చర్మ నిగారింపు, స్త్రీల ఆరోగ్యం కోసం వేర్వేరుగా ఉన్నాయి. వీటిని గిలోయ్‌, గోటుకోలా లాంటి మూలికలు, కొబ్బరినీళ్లు, కొన్ని రకాల పండ్లతో తయారుచేస్తారు. మూలికల గోలీలు, చూర్ణాలు, చ్యవన్‌ప్రాశ్‌లు తీసుకోవడానికి వెనుకంజ వేసేవాళ్లకు ఇవి మంచి ప్రత్యామ్నాయమని అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. ఆరోగ్య ప్రయోజనాలిస్తూనే సౌకర్యవంతంగా ఉండేవాటినే వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అందుకే వీటిని తయారుచేస్తున్నామంటున్నారు జెనిత్‌ కంపెనీ ఫౌండర్‌ దీపక్‌ అగర్వాల్‌.

**ట్రయల్స్‌ లేకుండా ఎలా?
లార్జ్‌ స్కేల్‌లో, దీర్ఘకాలిక ట్రయల్స్‌ చేయకుండా కుకీస్‌, జ్యూస్‌లు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయని ఎలా చెప్పగలమంటున్నారు డాక్టర్లు. సమస్యల పరిష్కారానికి సాయపడతాయన్న ఆధారాలేమున్నాయని ప్రశ్నిస్తున్నారు. కానీ, వీటి వినియోగదారులు మాత్రం ఈ ఉత్పత్తులతో చాలా హ్యాపీగా ఉన్నామంటున్నారు. వాటివల్ల ప్రయోజనాలున్నా లేకపోయినా నష్టాలైతే ఉండవు కదా అంటున్నారు. షుగరీ డ్రింక్స్‌ అయిన కోలా లాంటివి తీసుకునేబదులు మూలికలతో కూడిన ఈ పానీయాలను తీసుకుంటే మంచిదే కదా అని అభిప్రాయపడుతున్నారు