Devotional

ఇది కర్పూరం కథ

ఇది కర్పూరం కథ

ఈ పద్యం తెలియని వాళ్ళు ఉండరు కదా!

ఉప్పు, కర్పూరం ఒకే విధముగా కనిపించినా కానీ పరిశీలించి చూస్తే వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉంటాయి. ఆ విధముగానే మనుషులంతా చూడటానికి ఒకే ఆకారంతో, ఒకే అవయవ లక్షణాలను కలిగి ఉన్నా, గొప్పవారి లక్షణములు పరిశీలించి తెలుసుకుంటే, మామూలు మనుషులకంటే వారు విలక్షణముగా ఉంటారు అని దీని భావము.

కప్పురంపు మనసు కాంక్షించు యోగికి
జ్ఞానదీప శిఖయు తానటించు
కానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్ఛ
విశ్వదాభిరామ వినురవేమ.

కర్పూరం లాంటి స్వచ్ఛమైన మనసును అలవరచుకునే పవిత్రులలో జ్ఞానజ్యోతి (తత్వజ్ఞానమన్నమాట) వెలిగి, ఒకానొక ఆత్మస్ఫురణ కలుగుతుంది. అది క్రమంగా అతని అనుభవంలోకి వస్తుంది. అతడు కోరుకున్న ముక్తిని అప్పుడు పొందుతాడు అని అంటారు వేమన. ఇక్కడ దీప శిఖ అంటే దీపం యొక్క కొన, అగ్ని జ్వాల. నటించు అంటే ప్రవర్తించడం. ఇచ్ఛ అంటే కోరిక. అలభ్య వస్తువును సంపాదించడం కోసం కలిగే సంకల్పాన్ని ఇచ్ఛ అంటారు. ఇక్కడ ఇచ్ఛకు పర్యవసానం ముక్తి అని అంతరార్థం.

కళ్యాణం-కర్పూరం:

చదవడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కళ్యాణాలలో కర్పూరానికి ఒక ప్రత్యేకత ఉంది. వధూవరులు దండలు మార్చుకునేటప్పుడు ఈ కర్పూర దండలు తప్పక మార్చుకుంటారు.

ద్రిష్టి-కర్పూరం:

నీరాజనం అంటే దేవునికి ద్రిష్టి తీసే ప్రక్రియే. సినిమాల పుణ్యమా అని ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ తెచ్చేసి దాని మీద బండ రాయ పరిమాణంలో ఉండే పెద్ద కర్పూరం వెలిగించేసి మరీ ద్రిష్టి తీసేస్తారు. అదే కాక ఒక పెద్ద కర్పూరం వెలిగించి దానిని రెప్ప వేయకుండా చూస్తుంటే మన కంట్లో నీరు ఎంత కారుతుందో లేదా మన కళ్ళు ఎంత మండుతున్నాయో అంత ద్రిష్టి వుందని ఈ కర్పూర ద్రిష్టి కొలత.

మంత్రం-కర్పూరం:

కర్పూరంతో కొన్ని ట్రిక్కులు కూడా చేయవచ్చు. పూర్వం మంత్రగాళ్లు ఎవరితోనైనా నిజం చెప్పించాలన్నా, ఎదుట వాళ్లను మభ్యపెట్టాలన్నా కర్పూరాన్ని వాడేవారుట. ఆకుకు సన్నరంధ్రాలు చేసి దానిపై కర్పూరాన్ని ఉంచినప్పుడు ఆకు నీటిపై ఒక చోట నుంచి వేరే చోటికి వెళితే అబద్ధం చెప్పాడని, స్థిరంగా ఉంటే నిజం చెప్పాడని నమ్మించే వారు. అయితే దీని వెనుక ఉన్న కిటుకు ఏమిటంటే కర్పూరానికి నీటిలో తేలికగా కరిగే గుణం ఉండటం వలన నీటి తలతన్యత (Surface tension) తగ్గి నీరు అధిక తలతన్యత గల ప్రాంతం నుంచి అల్ప తలతన్యత గల ప్రాంతానికి ప్రయాణించటం వల్ల కర్పూరం ఉంచిన ఆకు లేదా కాగితం పడవ న్యూటన్ 3వ సూత్రం ప్రకారం కర్పూరం ఉన్న కాగితం నిశ్చల స్థితిలో ఉండదు గనుక, నీరు వెనక్కు కదిలినప్పుడు ముందుకు వెళ్తుంది.

తమిళ సామెత-కర్పూరం:

అల్పచిత్తునికి ఉదాత్త విషయాలు తెలియవు అని చెప్పే ప్రక్రియలో మనం వాడే సామెతలు ‘గాడిదకేం తెలుసు గంథంపొడి వాసన’, పందికేం తెలుసు పన్నీరు వాసన, పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ మొదలయినవి. ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తూ తమిళంలో ‘కళుదైక్కు తెరియుమూ కర్పూర వాసనై’ ( గాడిదకు తెలియునా కర్పూర వాసన) అనే రూపంలో కనిపిస్తుంది.

ఆరోగ్యం-కర్పూరం:

దీని వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.

కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.

కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.

కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.

కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.

జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.

అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.

పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.