Health

వ్యాయామం ఎందుకు?

వ్యాయామం ఎందుకు?

వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండటానికి కారణం ఏమిటనేది సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. అదేమంటే- వ్యాయామం చేసేటప్పుడు మోట్స్‌-సి అనే హార్మోన్‌ విడుదలవుతుందనే విషయాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించారు. అయితే అది ఎందుకనేది అప్పట్లో తెలియలేదు. పైగా ఈ హార్మోన్‌ జన్యుసమాచారం శరీరంలోని ఇతర జన్యువులకన్నా భిన్నంగా ఉందనీ, వయసురీత్యా పనితీరు తగ్గిన మైటోకాండ్రియా కణాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుందనీ తాజాగా గుర్తించారు. ఇందుకోసం వీళ్లు రోజూ వ్యాయామం చేసేవాళ్లను ఎంపికచేసి వ్యాయామానికి ముందూ తరవాత వాళ్ల శరీరంలో ఈ హార్మోన్‌ శాతాన్ని లెక్కించారట. వ్యాయామానికి ముందుకన్నా తరవాత ఈ హార్మోన్‌ శాతం 12 శాతం పెరిగిందట. ఈ విషయాన్ని నిర్ధరించేందుకు ఎలుకలకి ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేయగా వృద్ధ దశలో ఉన్న ఎలుకలు సైతం చక్కగా ట్రెడ్‌మిల్‌ చేయడమేకాదు, బాగా నడవడం ప్రారంభించాయట. దీన్నిబట్టి వ్యాయామం చేసేవాళ్లు వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం ఈ హార్మోన్‌ విడుదల కావడమే అని భావిస్తున్నారు.