Health

గోళ్లు విరిగిపోతున్నాయంటే….

గోళ్లు విరిగిపోతున్నాయంటే….

గోళ్లపై గీతలు పడటం, తరచూ విరిగిపోవడం… ఇవన్నీ వాటికి సరైన పోషకాలు అందట్లేదనడానికి సంకేతాలు. వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలతోనే వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో చూద్దామా…
* గోళ్లకు తేమ సరిగ్గా అందకపోవడం వల్ల అవి సులువుగా విరిగిపోతాయి. ఈ సమస్యకు బాదం నూనె చక్కని పరిష్కారం. రోజులో ఒక్కసారైనా ఈ నూనెతో మర్దనా చేయడం వల్ల గోళ్లు మృదువుగా, ఆరోగ్యంగా మారతాయి. లేదంటే గోరువెచ్చని కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడినా ఫలితం ఉంటుంది.
* విటమిన్‌-ఇ లోపం కూడా ఈ సమస్యలకు కారణమే. ఒకసారి వైద్యులను సంప్రదించి విటమిన్‌-ఇ మాత్రల్ని తీసుకుంటే మంచిది. లేదంటే విటమిన్‌-ఇ నూనెను తరచూ రాసుకోవడం వల్ల కూడా గోళ్లు బలంగా మారతాయి.
* ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనికుండే ఆమ్ల లక్షణం ఫంగస్‌ను సులువుగా నివారిస్తుంది. అందుకే దీన్ని గోళ్లకు తరచూ రాసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
* గ్రీన్‌టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కాచి చల్లార్చిన గ్రీన్‌టీలో కాసేపు వేళ్లు ఉంచి ఆ తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పసుపు పచ్చగా మారిన గోళ్లు మామూలు రంగులోకి మారి తాజాగా కనిపిస్తాయి.
* నిమ్మరసంలో దూది ఉండ ముంచి గోళ్లను తుడవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గోళ్లు ఇంకా పాడవకుండా కాపాడతాయి. కాస్త టొమాటో గుజ్జు తీసుకుని ఒక పదినిమిషాలు అందులో వేళ్లు ఉంచి ఆ తరువాత కడిగేసినా ఫలితం ఉంటుంది.