Food

ఆరోగ్యంగా తినడం అంటే ఏమిటి?

ఆరోగ్యంగా తినడం అంటే ఏమిటి?

చాలామంది రోజూ పండ్లూ కూరగాయలూ చేపలూ ముడిధాన్యాలూ… వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అదే సమయంలో వాటితోపాటు ప్రాసెస్డ్‌ ఆహారాన్నీ స్వీట్లనీ మాంసాహారాన్నీ కూడా తింటుంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో వచ్చే లాభాలూ తగ్గిపోతాయి అంటున్నారు రష్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు. అదెలా అంటే- మధ్యధరా తీరానికి చెందిన ఆహారం అన్నింటికన్నా ఆరోగ్యకరమైనదనీ, అది తినేవాళ్లలో ఆల్జీమర్స్‌ వంటి సమస్యలూ తక్కువగా ఉంటున్నట్లు గత పరిశోధనల్లో స్పష్టమైంది. అందుకే 65 ఏళ్ల వయసుదాటిన వాళ్లని ఎంపిక చేసి వాళ్లలో అచ్చంగా మధ్యధరా ఆహారాన్ని తినేవాళ్లనీ, వాటితోపాటు జంక్‌పుడ్డునీ తీసుకునేవాళ్లని విభజించారట. రెండు రకాల ఆహారాన్ని తినేవాళ్లతో పోలిస్తే అచ్చంగా మెడిటరేనియన్‌ ఆహారం తీసుకున్నవాళ్లలో జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ మెరుగ్గా ఉన్నాయనీ ఆల్జీమర్స్‌ వంటి సమస్యలు తలెత్తలేదనీ గుర్తించారు. దీన్నిబట్టి ఎంత మంచి ఆహారం తీసుకున్నా దాంతో జంక్‌ఫుడ్డు కలిస్తే వచ్చే లాభం అంతంతమాత్రమే అన్నది మర్చిపోకండి.