WorldWonders

కడపలో హిజ్రాల దారుణం

కడపలో హిజ్రాల దారుణం

హిజ్రాగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కుర్రాడు.. బంధువుతో వాట్సాప్‌ వీడియోకాల్‌ మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనతోపాటు మరో ముగ్గురు జడ్చర్ల యువకులు హిజ్రాలుగా మారినట్టు అతను బయటపెట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది. జడ్చర్ల పురపాలిక పరిధి నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్‌ (18) తల్లిదండ్రులు చనిపోయారు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర పెరిగిన అతను ఏడాది కిందట అదృశ్యమయ్యాడు. అప్పట్నుంచి శ్రీకాంత్‌ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తండాలో ఉంటున్న మేనమామ కుమారుడు వినోద్‌కు వాట్సాప్‌ విడియో కాల్‌చేశాడు. ‘ప్రస్తుతం కడప పట్టణం ఏఎస్‌ఆర్‌ కాలనీలో ఉంటున్నా. కొందరు నన్ను హిజ్రాగా మార్చారు. నా పేరును శ్రీలేఖగా మార్చారు. కడపలో ఉంటున్న యువకుడిని ప్రేమించా. అతను వేరే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని చెబుతూనే పురుగుమందు తాగాడు. వెంటనే తండాలోని బంధువులు విషయాన్ని మహబూబ్‌నగర్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, తెరాస నాయకుడు ఇంతియాజ్‌ దృష్టికి తీసుకెళ్లగా, వారు జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీలేఖను గుర్తించి అదేరోజు కడప రిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. శ్రీకాంత్‌ తనతో మాట్లాడుతున్న సందర్భంలో జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు యువకులు హిజ్రాల చెరలో ఉన్నట్టు, వారు కూడా హిజ్రాలుగా మారినట్టు చెప్పాడని వినోద్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.