Business

మహీంద్రా భారీ తగ్గింపు ధరలు-వాణిజ్యం

మహీంద్రా భారీ తగ్గింపు ధరలు-వాణిజ్యం

* ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా కంపెనీ ఫిబ్రవరి నెలలో తన బిఎస్6 ఎస్‌యూవీలపైన డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. బోలెరో కారుపై రూ.24వేల నుంచి మొదలు పెడితే అల్టురాస్ జీ4పై రూ.3.06లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఫిబ్రవరి 28, 2021 వరకు ఉంటాయి. ఈ ఆఫర్లు మీ ప్రాంతాలలో డీలర్షిప్ బట్టి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

* ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సీఈఓ కొనసాగుతున్న టెస్లాకు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో గణనీయమైన రికార్డు ఉంది. చాలా కాలం నుంచి టెస్లాకు చెందిన షేర్ ధరలతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దింతో ఈవీ రంగంలో విపరీతమైన ఆధిపత్యం సాదించింది. కానీ, ఇప్పుడు టెస్లాకు పోటీ ఇచ్చేందుకు మరోకారు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కొత్త కారు కంపెనీ సీఈఓ పీటర్ రావ్లిన్సన్ గతంలో టెస్లా ఎలక్ట్రిక్ తయారీలో ముఖ్య భూమిక పోషించారు. ప్రస్తుతం టెస్లా ఈ స్థాయికి చేరుకొవడంలో ప్రధాన పాత్ర పోషించిన పీటర్ రావ్లిన్సన్. గతంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. టెస్లా నుంచి బయటకు వచ్చిన తర్వాత “లూసిడ్ మోటార్స్” అనే సంస్థను స్థాపించి ఎలక్ట్రిక్ కార్ల తయారీని మొదలుపెట్టారు. లూసిడ్ మోటార్స్ బ్రాండ్ కింద విడుదలైన మొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు టెస్లాకు దీటుగా తీసుకొచ్చినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. తాము లగ్జరీ కార్ల తయారీ చేస్తున్నందున టెస్లాతో మాకు పోటీ లేదని పీటర్‌ రావ్లిన్సన్ పేర్కొన్నారు‌. లూసిడ్ మోటార్స్ బ్రాండ్ కింద విడుదలైన ‘లూసిడ్ ఎయిర్’ కారు సాంకేతికత విషయంలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్, జీఎమ్ వంటి సంస్థలతో మార్కెట్లో పోటీ పడగలదని పీటర్ తెలిపారు. టెస్లా కంపెనీకి చెందిన రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న “మోడల్ ఎస్” కోసం చీఫ్ ఇంజనీర్‌గా ఒక దశాబ్దం క్రితం పని చేశారు.

* బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలు పరిచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ మేరకు ముంబయిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఇదివరకే ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు ఆమె నిరాకరించారు.

* ప్రభుత్వ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా రూ.3,200 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) సీహెచ్‌.ఎస్‌ఎస్‌.మల్లికార్జునరావు విషయాన్ని వెల్లడించారు. ఈ త్రైమాసికంలోనే నిధుల సమీకరణ పూర్తి చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రుణ పత్రాలు, ఈక్విటీ షేర్లు జారీ చేయటం ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించటానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు గతంలో అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో రూ.3,000 కోట్లకు ఏటీ-1 బాండ్లు, రూ.4,000 కోట్లకు టైర్‌-2 బాండ్లు జారీ చేయాలని, రూ.7,000 కోట్లకు క్యూఐపీ చేయాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. దీని ప్రకారం టైర్‌-2 బాండ్లు జారీ చేయటం ద్వారా రూ.4,000 కోట్లు సమీకరించే పని పూర్తిచేశారు. రూ.3,788 కోట్లకు క్యూఐపీ కూడా చేశారు. ఈ ఏడాది జనవరిలో రూ.500 కోట్లకు ఏటీ-1 బాండ్లు జారీ చేశారు. ఇంకా రూ.2,500 కోట్లకు ఏటీ-1 బాండ్లు జారీ చేయటానికి, రూ.3,200 కోట్లకు క్యూఐపీ చేయటానికి అవకాశం ఉంది. అందువల్ల ఏటీ-1 బాండ్లు జారీ చేయటంతో పాటు క్యూఐపీ కూడా చేపట్టాలని బ్యాంకు యాజమాన్యం భావిస్తోంది. ఈ ఏడాది మార్చి 31 లోపు ఈ పని పూర్తిచేయాలనేది ఆలోచన. ప్రస్తుత అవసరాలకు మా వద్ద ఉన్న ఉన్న మూలధనం సరిపోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా పెద్దగా మూలధన అవసరాలు లేవు అని ఆయన అన్నారు.

* దివీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.471 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1721 కోట్లు ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1438 కోట్లు, నికరలాభం రూ.359 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. దీంతో పోల్చితే ఈ మూడో త్రైమాసికంలో ఆదాయం, నికరలాభం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి దివీస్‌ లేబొరేటరీస్‌ మొత్తం ఆదాయం రూ.5,224 కోట్లు, నికరలాభం రూ.1,482 కోట్లు ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.4,118 కోట్లు కాగా, నికరలాభం రూ.988 కోట్లు ఉంది.