Editorials

ఉక్కుపైనే గ్రేటర్ విశాఖ భవిత

ఉక్కుపైనే గ్రేటర్ విశాఖ భవిత

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న వివిధ రాజకీయ పార్టీలను స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం ఒక్క కుదుపు కుదిపింది. పంచాయతీ పోరు ముగిసిన వెంటనే గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టనున్నారనే ప్రచారంతో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేతలు ఈ అంశంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నగర వాసులతో విడదీయరాని బంధం వున్న స్టీల్‌ప్లాంట్‌ విషయంంలో ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయంపైనే గ్రేటర్‌లో వాటి భవిష్యత్తు ఆధారపడి వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జీవీఎంసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా అలజడి నేపథ్యంలో ఈ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 21తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం మునిసిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం వుందన్న సంకేతాల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ జీవీఎంసీ ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ తరుణంలో కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో నగరవాసులతో పాటు రాజకీయ పార్టీల్లోనూ అలజడి మొదలైంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించిన స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల సాకుతో ప్రైవేటుకు అప్పగించడాన్ని అన్నివర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని గొంతెత్తి నినదిస్తున్నారు.

ఈ పరిణామం జీవీఎంసీ ఎన్నికలపై తీవ్రంగా పడుతుందని, గ్రేటర్‌లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ఈ అంశమే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. ఇది మొదటిగా భారతీయ జనతా పార్టీపై ప్రభావం చూపుతుందంటున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆ పార్టీ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లేదంటే జీవీఎంసీ ఎన్నికల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికార వైసీపీకి కూడా స్టీల్‌ప్లాంట్‌ అంశం కత్తిమీద సాములా పరిణమించింది. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు పార్లమెంట్‌ వేదికగా పోరాడాల్సి బాధ్యత వైసీపీపైనే ఉందంటున్నారు. ఆ స్థాయిలో కేంద్రంతో పోరాడేందుకు ఏమాత్రం భయపడినా, వెనుకడుగు వేసినా నగర వాసుల ఆగ్రహానికి గురికాక తప్పదని, జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుందంటున్నారు. ఇక ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌ అంశంపై పోరాటం ప్రారంభించినా, రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారు?…అనే అంశంపై వేచిచూడాలంటున్నారు. ఏది ఏమైనా సాఫీగా సాగిపోతాయనుకున్న జీవీఎంసీ ఎన్నికలు, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో అలజడికి కారణమయ్యాయి.

1963లో నాటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి సుబ్రహ్మణ్యం ఆంగ్లో అమెరికన్‌ బృందం సిఫారసు మేరకు 5వ ఉక్కు కర్మాగారం విశాఖలో నిర్మించడానికి హామీ ఇచ్చారు. 1966 వరకూ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దాంతో సమస్య ఉద్ధృత రూపం దాల్చింది. ఉక్కు కర్మాగారానికి నిపుణుల బృందం సిఫారసు చేసిన విశాఖలోనే కర్మాగారం నిరించాలని కోరుతూ తెన్నేటి విశ్వనాథం అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి లేఖలు రాశారు. ఆమె విశాఖ వచ్చినప్పుడు స్వయంగా కలసి వివరించారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆంగ్లో అమెరికన్‌ సిఫారసును బహిరంగ పరచాలని, దాంట్లో విశాఖలో కర్మాగారం నిర్మించాలని లేకపోతే ఆందోళన విరమిస్తామన్నారు. తెన్నేటి పిలుపు మేరకు యావదాంధ్రప్రదేశ్‌ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మారుమోగిపోయింది. ఊరూ వాడా సభలు, సమావేశాలు, ఆందోళనలు విజృంభించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెన్నేటి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆందోళన మరింతగా పెరగడంతో విశాఖ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఉద్యమ కారులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ఉక్కు కార్మాగారం విషయంలో తెన్నేటి జరిపిన ఆందోళన కారణంగా 1970 ఏప్రిల్‌లో ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణానికి సమ్మతిస్తూ ప్రకటన చేశారు. ఆ వార్త యావదాంధ్ర దేశాన్ని ఆందోత్సాహాలతో నింపింది. ఆపై 1971లో తెన్నేటి సమక్షంలో ఆమె ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.