Agriculture

రుణమాఫీ దెబ్బకు రుణాలు ఆపేసిన బ్యాంకులు

రుణమాఫీ దెబ్బకు రుణాలు ఆపేసిన బ్యాంకులు

ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో రైతులు రికార్డు స్థాయిలో పంటలు సాగు చేసినా వారికి బ్యాంకుల నుంచి రుణసాయం అందడం లేదు. వానాకాలం(ఖరీఫ్‌)లో కూడా అరకొరగానే అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.53,222 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి’ గత ఏప్రిల్‌లో లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ బ్యాంకులు తొలి 10 నెలల్లో(గత నెలాఖరుకు) రూ.32,803 కోట్లే ఇచ్చాయి. ఈ ఏడాది వచ్చే నెలాఖరుతో ముగియనుంది. మిగిలిన 40 పని దినాల్లో రూ.20,419 కోట్ల పంట రుణాలను బ్యాంకులు రైతులకు ఇస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత అక్టోబరులో మొదలైన యాసంగి సీజన్‌ కూడా వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ‘‘ధరణి పోర్టల్‌లో భూ రికార్డులను నేరుగా బ్యాంకులోనే చూసే అవకాశం మాకు ఇంకా ఇవ్వలేదు. తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందిని అడిగి అందులో రైతుల వివరాలను చూడాల్సి వస్తోంది. దీనివల్ల పంట రుణాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతున్న మాట వాస్తవం’’ అని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ బ్యాంకు ముఖ్య అధికారి చెప్పారు. అలాగే ఎలాంటి పూచీకత్తు అడగకుండా రూ.లక్షా అరవై వేల వరకూ పంట రుణం ఇవ్వాలని రిజర్వు బ్యాంకు ఆదేశాలున్నాయి. మరోపక్క ‘ధరణి పోర్టల్‌లో ఉన్న భూమి వివరాలను ఆన్‌లైన్‌లో చూసి పంటరుణం ఇవ్వాలి. పట్టాదారు పాసుపుస్తకం తనఖా కింద తీసుకోవద్దు’ అని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. కానీ ఏ బ్యాంకు కూడా పూచీకత్తు లేకుండా పంటరుణం ఇవ్వడం లేదు. ధరణి పోర్టల్‌లో వివరాలు కనపడటం లేదని రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలూ తీసుకుంటున్నాయి. రుణ మాఫీ పథకం కింద రూ.25 వేల లోపు బకాయి ఉన్నవారికే ప్రభుత్వం చెల్లించింది. అంతకన్నా ఎక్కువ బకాయి ఉన్నవారు మాఫీ డబ్బు వస్తుందిలే అని పాత బకాయిలు కట్టడం లేదు. 2018 డిసెంబరు 11 వరకూ బ్యాంకులో రూ.లక్ష వరకూ పంటరుణం బకాయి ఉన్నవారికి మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది పాత బకాయి కట్టేసి కొత్త రుణం తీసుకోవాలని… పాత బకాయి కట్టేసినా 2018 డిసెంబరు నాటికి రూ.లక్షలోపు ఉన్న బకాయిని చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ అలా కట్టేస్తే మాఫీ డబ్బు వస్తుందో రాదోనన్న అనుమానంతో కొందరు రైతులు కట్టడం లేదు. దీనివల్ల వారికి కొత్త రుణం ఇవ్వలేకపోతున్నట్లు బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని ఇవ్వనందున రైతు నుంచే పూర్తి వడ్డీని వసూలు చేస్తున్నాయి. వడ్డీలేని రుణాల పథకం అమలుకు ఈ ఏడాది అనుమతి రానందున వడ్డీ నిధులు ఇవ్వడం లేదని వ్యవసాయశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఈ సీజన్‌లో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 36.93 లక్షల ఎకరాలకు గాను 59.75 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. వరి 22 లక్షల ఎకరాలకు గాను 46.24 లక్షల ఎకరాలు దాటింది.