Business

ఖజానాకు ₹2526కోట్ల అధిక ఆదాయం

ఖజానాకు ₹2526కోట్ల అధిక ఆదాయం

తెలంగాణా రాష్ట్రంలో ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని జమ చేసే వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో గత ఏడాదికంటే 6.6 శాతం వృద్ధిరేటు నమోదైంది. జవవరి నెలాఖరు నాటికి అమ్మకం పన్ను, జీఎస్టీ, జీఎస్టీ పరిహారంతో కలిపి రూ. 40,756 కోట్ల రాబడి వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 2,526 కోట్లు అధికం. కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 నెలలు రాబడి నామమాత్రంగా నమోదైనా ఆ తర్వాత కొంత పుంజుకుంది. వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను, మద్యంపై అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ రాబడులు ఇందులో ఉన్నాయి. మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటి దాకా పెట్రోలియం ఉత్పత్తులపై గతం కంటే రాబడి తగ్గగా మద్యంపై అమ్మకం పన్ను రాబడులు పెరిగాయి. గత ఏడాదికంటే 6 శాతం దాకా రాబడి పెరిగినా రాబడి అంచనాల్లో జనవరి ఆఖరు వరకూ 69 శాతమే నమోదైంది. మిగిలిన రెండు నెలల్లో మరో 20 శాతం వచ్చే అవకాశం ఉందని వాణిజ్య పన్నులశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాబడులను పెంచుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. పన్నులను పూర్తిగా వసూలు చేయడంతో పాటు మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు.