Politics

షర్మిలతో జగన్ దూత భేటీ-తాజావార్తలు

Alla Ramakrishna Reddy Meets Sharmila - Telugu Political News

* తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలను వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు.లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలో గురువారం మధ్యాహ్నం షర్మిలతో రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.షర్మిలతో మాట్లాడిన అనంతరం బ్రదర్ అనిల్ కుమార్‌తో కూడా రామకృష్ణారెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ అనుమతితోనే షర్మిలను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలినట్లు తెలుస్తోంది.జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని సమాచారం.

* ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎస్‌ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని తప్పుబట్టారు. ఎస్‌ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని, అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్‌ఈసీని కోరామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్‌ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడారని, అధికారులను బెదిరించిన పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

* ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన తర్వాత.. ఆమె ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఖమ్మం నేతలతో చర్చించారు. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. ఆ రోజు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ఖమ్మంకు ఆమె బయల్దేరనున్నారు. పోడు భూముల సమస్యలే ఎజెండాగా ఆ సమ్మేళనం నిర్వహించనున్నట్టు పలువురు నేతలు చెబుతున్నారు. సమ్మేళనానికి ముందు వైఎస్ అభిమానులు, గిరిజనులతో షర్మిల సమావేశమవుతారని సమాచారం.

* ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఈనెల 16న నోటిఫికేషన్‌ వెలువడుతుందని, మార్చి 14న పోలింగ్‌ జరుగు తుందని, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుందని వెల్లడించింది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడింది

* రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఖైదీల ములాఖత్ లు తిరిగి ప్రారంభం.రిమాండ్ లో ఉన్న ఖైదీలను వారానికి ఒకసారి ఇద్దరు విజిటర్స్, శిక్షపడిన వారికి 15 రోజులకు ఒకసారి ఇద్దరు సందర్శకులకు ములాఖత్ అవకాశం..రక్తసంబంధీకులకు మాత్రమే ఐరన్ మెస్ ఉన్న కిటికీల ద్వారా ములాఖత్ అనుమతి..

* లద్దాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

* భాజపా సిద్ధాంతకర్త దీన్​దయాళ్ ఉపాధ్యాయ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.దీన్​దయాళ్​ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.

* టీఆర్ఎస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీకి ఎన్నికైన నూత‌న కార్పొరేట‌ర్ల‌లో ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న జోష్ నింపారు.తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో స‌మావేశం ముగిసిన అనంత‌రం నూత‌న కార్పొరేట‌ర్లు, ఎక్స్ అఫిషియో స‌భ్యులు ప్ర‌త్యేక బ‌స్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి బ‌య‌ల్దేరారు.ఈ సంద‌ర్భంగా గోరెటి వెంక‌న్న త‌న పాట‌తో కార్పొరేట‌ర్ల‌ను ఉత్తేజ‌ప‌రిచారు.

* రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరికి కారు పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ విధేయులనే వరించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి మేయర్‌ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్‌ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు : మేయర్‌ పీఠం కోసం తొలినుంచి అధికార టీఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్‌)తో పాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి, పీజేఆర​ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్‌ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్‌ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. దీంతో జైశ్రీరాం అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు.
పీజేఆర్‌ విజయారెడ్డి నిరాశ : ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. హాల్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు ఆమె వ్యవహార శైలిని గమనించారు. కాగా పార్టీ శ్రేణులు విజయారెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా ఆమె అంతే.. వదిలేసేయండి అంటూ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మీడియా దృష్టిలో పడటానికి విజయా రెడ్డి ఇలా చేశారనే వాదన వినిపిస్తుంది. కాగా గ్రేటర్‌ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతో టీఆర్‌ఎస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చేజిక్కించుకుంది.

* హైదరాబాద్ మేయర్ పదవి ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ఇప్పటి వరకు తాజాగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకునే కార్యక్రమం ప్రారంభం కానుంది. తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది. మేయర్ అభ్యర్థిగా కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం. మరోవైపు, మేయర్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మేయర్ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనకుండా ఆమె వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోవడంతో టీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు. విజయారెడ్డికి అనుకూలంగా పీజేఆర్ అభిమానులు నినాదాలు చేశారు. తమ నాయకురాలికి కాకుండా, కేకే కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.